ప్రశ్నపత్రాల లీకేజీపై ప్రశ్నిస్తే కేసులా?
● బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
కాగజ్‌నగర్‌రూరల్: ప్రశ్నపత్రాల లీకేజీపై ప్రశ్నిస్తే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారని బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. కాగజ్‌నగర్ పట్టణంలోని తన నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం పెట్టిన ఘనత బీఆర్‌ఎస్ పార్టీదని, సచివాలయానికి కూడా అంబేడ్కర్ పేరు పెట్టారని గుర్తు చేశారు. 80 మంది గురుకుల విద్యార్థుల ప్రాణాలు తీసినందుకు సీఎం రేవంత్‌రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పదో తరగతి పరీక్షలు నిర్వహించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. పోలీసులు, అధికారులు, ఇన్విజిలేటర్లు ఉండగా నిందితుడు పరీక్ష కేంద్రంలోకి ఎలా వెళ్లాడని ప్రశ్నించారు. పేపర్ లీకేజీకి కారణమైన అసలు నిందితులను పట్టుకోవాలని, కేటీఆర్‌పై పెట్టిన అట్రాసిటీ కేసు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రశ్నిస్తే ప్రతిపక్షాలపై కేసులు పెట్టడం మానుకోవాలని హితవు పలికారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు హయాంలో ప్రజల ఆరోగ్య పరిస్థితి ఘోరంగా ఉందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యంతో బుధవారం ఓ యువకుడు మృతిచెందాడని పేర్కొన్నారు. బెజ్జూర్‌లో పాత పోలీస్‌స్టేషన్ స్థలాన్ని కబ్జా చేసినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. సమావేశంలో నాయకులు లెండుగురె శ్యాంరావు, ఆవుల రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.