
సర్వర్ డౌన్..!
● రెండ్రోజులుగా మొరాయింపు ● సర్టిఫికెట్ల జారీకి ఆటంకం ● ఆఫీసుల్లో అర్జీదారుల నిరీక్షణ ● వరుస సెలవులతో ఆందోళన
రెబ్బెన: రాజీవ్ యువవికాసం పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు నిరుద్యోగ యువత పడుతున్న క ష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఈ పథకం కింద రూ.50 వేల నుంచి రూ.4లక్షల వరకు స్వయం ఉపాధి కోసం సబ్సిడీ రుణాలు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన వారి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తోంది. కాగా, ఇందుకు కులం, ఆదాయం, నివాస ధ్రువీకరణ పత్రాలు అవసరం కాగా నిరుద్యోగులు మీసేవా కేంద్రాలు, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. వందల సంఖ్యలో దరఖాస్తులు వస్తుండటంతో మీసేవా కేంద్రాల నిర్వాహకులు, రెవెన్యూ సిబ్బందికి తలకు మించిన భారమవుతోంది.
మొరాయిస్తున్న సర్వర్
కులం, ఆదాయం, నివాస ధ్రువీకరణ పత్రాల జారీ కోసం రెవెన్యూ సిబ్బంది వినియోగించే సర్వర్ రెండు రోజులుగా మొరాయిస్తోంది. దీంతో ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఒక్క చింతలమానెపల్లి తహసీల్దార్ కార్యాలయంలో సుమారు 900కు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. దీంతో దరఖాస్తుదారులు సర్టిఫికెట్ల కోసం తహసీల్దార్ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు గడువు ఏప్రిల్ 5తో ముగియనుంది. వరుసగా ఆది, సోమ, మంగళవారాలు సె లవు దినాలు కావడంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. గడువులోపు సర్టిఫికెట్లు అందుతా యో లేదోనని అయోమయానికి గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆందోళన చెందుతున్న వీరు దరఖాస్తు గడుపు పొడిగించాలని కోరుతున్నారు.
సర్వర్ డౌన్ అవుతోంది
కులం, ఆదాయం, నివాస ధ్రువీకరణ పత్రాల జారీకి సర్వర్ డౌన్ అడ్డంకిగా మారింది. రెండు రోజులు గా మొరాయిస్తుండగా సర్టిఫికెట్ల జారీ ఆలస్యమవుతోంది. ఆపరేటర్ గంటలకొద్దీ కూర్చున్నా రోజుకు 10 సర్టిఫికెట్లు కూడా పూర్తి కావడం లేదు. వరుస సెలవులున్నా కూడా ఆపరేటర్‌ను అందుబాటులో ఉంచి సర్టిఫికెట్లు జారీ చేస్తాం.
– రామ్మోహన్‌రావు, రెబ్బెన తహసీల్దార్

సర్వర్ డౌన్..!