సోదాల కలకలం | - | Sakshi
Sakshi News home page

సోదాల కలకలం

Published Fri, Apr 4 2025 2:03 AM | Last Updated on Fri, Apr 4 2025 2:03 AM

సోదాల కలకలం

సోదాల కలకలం

● రవాణా శాఖ చెక్‌పోస్టులో ఏసీబీ తనిఖీలు ● రాత్రిపూట రంగంలోకి దిగిన వైనం ● వాంకిడి వద్ద రూ.45,100 నగదు లభ్యం

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రవాణా శాఖ చెక్‌పోస్టుల్లో ఏసీబీ అధికారుల తనిఖీలు కలకలం రేపుతున్నాయి. బుధవారం రాత్రి జరిపిన సోదాల్లో వాంకిడి చెక్‌పోస్టులో రూ.45,100 పట్టుబడ్డాయి. రాత్రి 11.45 గంటల నుంచి తెల్లవారు జామున 3గంటల వరకు తనిఖీలు కొనసాగాయి. ఆదిలాబాద్‌, కరీంనగర్‌ డీఎస్పీలు విజయ్‌కుమార్‌, రమణమార్తి, మరో నలుగురు సీఐలు ఏకకాలంలో అక్కడి రికార్డులు పరిశీలించారు. రెండు ఫోన్లు సీజ్‌ చేశారు. ఆ సమయంలో డ్యూటీలో ఏఎంవీ మాత్రమే ఉండగా, ఇంకా ప్రైవేటు వ్యక్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇదే తరహాలో గతేడాది మేలో భోరజ్‌ చెక్‌పోస్టు వద్ద రూ.11,630, గత డిసెంబర్‌ 4న రూ.62,500 నగదు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాయి. చెక్‌పోస్టుల్లో నిత్యం వాహనదారులు, డ్రైవర్లు, సహాయకుల నుంచి బండికో రేటుగా అనధికారికంగా ప్రైవేటు సిబ్బంది వసూళ్లు చేస్తున్నది బహిరంగ రహస్యమే. ఏసీబీ సోదాలతో గురువారం వాంకిడిలో ఎలాంటి తనిఖీలు లేకుండానే వాహనాలు రాకపోకలు సాగించాయి.

డ్యూటీకి కోసం పోటీ

రవాణా శాఖలో చాలామంది అధికారులు, సిబ్బంది చెక్‌పోస్టుల్లో డ్యూటీ చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్ల నుంచి సీనియర్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు, సిబ్బంది వరకు రాజకీయ, ఉన్నతాధికారుల పైరవీలతో అక్కడ డ్యూటీలు తెచ్చుకుని పని చేస్తున్నారు. చెక్‌పోస్టు డ్యూటీకి వెళ్తే ‘లాభదాయకం’గా మారడంతో పోటీ పడుతున్నారు. అక్కడ పని చేస్తున్న అధికారుల సంఖ్యను బట్టి రోజువారీగా డ్యూటీల్లో ఉంటున్నారు.

నగదు ముట్టుకోకుండా

ఏసీబీ అధికారులు ప్రభుత్వ ఉద్యోగులపైనే కేసులు నమోదు చేస్తూ విచారణ చేస్తుంటారు. ఒకవేళ ప్రైవేటు వ్యక్తులు ఉంటే వారు ఏ అధికారి ప్రోద్బ లంతో ఉన్నారు? వారివెనక ఎవరున్నారనేది స్పష్టమైన ఆధారాలు తీసుకుంటారు. లేకపోతే అధికారులపై కేసులు నమోదు చేసే అవకాశం లేదు. సాధారణంగా లంచం తీసుకునేటప్పుడు నేరుగా దొరికిన ఆ అధికారి చేతులు, నగదుతో రసాయన పరీక్ష చేసి, సాంకేతిక ఆధారాలతో కోర్టులో సమర్పిస్తారు. కానీ చెక్‌పోస్టుల్లో ఏ అధికారీ చేతితో పైసలు ముట్టుకోరు. దీంతో లెక్కచూపని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనేవి మిస్టరీగా మారుతోంది. అవినీతి కేసులో పక్కా ఆధారాలు ఉంటే కేసు ముందుకు వెళ్తుంది. గతంలో పట్టుబడిన నగదుపైనా ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా దొరికిన నగదుపైనా ఏసీబీ అధికారులు లోతుగా దర్యాప్తు చేయనున్నారు.

మూడు చోట్ల ఇదే తంతు

ఉమ్మడి జిల్లా మహారాష్ట్రకు సరిహద్దుతో, ఉత్తర, దక్షిణ భారతదేశానికి కీలక రోడ్డు మార్గంగా ఉంది. ఆదిలాబాద్‌లోని ఎన్‌హెచ్‌–44పై భోరజ్‌, ఆసిఫాబాద్‌ జిల్లా ఎన్‌హెచ్‌–363పై వాంకిడి, నిర్మల్‌ పరిధి ఎన్‌హెచ్‌–61 వద్ద తానూరు మండలం బెల్‌తరోడా వద్ద అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు ఉన్నాయి. ఇక్కడే సమీకృత చెక్‌పోస్టులు ఉన్నాయి. రవాణా శాఖ చెక్‌పోస్టులో నిత్యం వందల వాహనాలను చట్ట ప్రకారం అన్ని ధ్రువపత్రాలు ఉన్నాయా? లేవా? అని తనిఖీలు చేస్తూ అధికారులు అనుమతి ఇవ్వాలి. అయితే పరిశీలన పేరుతో వాహనదారుల నుంచి అనధికారికంగా డబ్బులు వసూలు చేస్తున్నరనేది ప్రధాన ఆరోపణ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement