టీడీపీ సిట్టింగ్‌ ఎంపీని పక్కన పెట్టేసినట్టేనా? | - | Sakshi
Sakshi News home page

టీడీపీ సిట్టింగ్‌ ఎంపీని పక్కన పెట్టేసినట్టేనా?

Published Thu, Mar 23 2023 1:36 AM | Last Updated on Thu, Mar 23 2023 11:13 AM

- - Sakshi

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో టీడీపీ గెలుపొందిన మూడు లోక్‌సభ స్థానాల్లో విజయవాడ ఒకటి. రెండో దఫా 8,726 ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన కేశినేని శ్రీనివాస్‌(నాని)ను తన నియో జకవర్గం పరిధిలోని ముఖ్య నాయకులు ఏమాత్రం పరిగణనలోకి తీసుకుంటున్న దాఖలాలు కనిపించడంలేదు. పార్టీ అధినేత చంద్రబాబు డైరెక్షన్‌లో నియోజకవర్గ నాయకులు యాక్షన్‌ చేస్తున్నట్లు స్పష్టమవుతోందని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో దాదాపు అన్నిచోట్లా చిన్ని కనిపిస్తుండగా ఎంపీ నాని ఊసే ఉండటంలేదు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలకు ఎంపీని ఉద్దేశపూర్వకంగానే విస్మరిస్తూ చిన్నికి ప్రాధాన్యమిస్తున్నారని గుర్తుచేస్తున్నారు. సిట్టింగ్‌ ఎంపీని పక్కనపెట్టాలనే సూచనలేవో అధిష్టానం నుంచే ఉన్నట్లు తాజా పరిస్థితులు తెలియజేస్తున్నాయని ముఖ్యులు అంటున్నారు.

విజయవాడ లోక్‌సభ స్థానం పరిధిలో మెడికల్‌ క్యాంపులు, అన్న క్యాంటీన్లు, దుస్తుల పంపిణీ తదితర కార్యక్రమాలను చిన్ని స్థానిక నాయకులతో కలిసి కొనసాగిస్తున్నారు. జగ్గయ్య పేట నాయకులు మినహా తక్కిన నియోజకవర్గాల ఇన్‌చార్జులు నిర్వహించే కార్యక్రమాలకు హాజరుకా వాలని మాటమాత్రంగానైనా ఎంపీని ఆహ్వానించడంలేదు. పలకరింపులు సైతం దాదాపు కరువయ్యాయి. గత ఆదివారం విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి పిలుపులేదు సరికదా సమాచారం కూడా ఇవ్వలేదని తెలిసింది. ఈ కార్యక్రమానికి పార్టీ పరంగా ఏ హోదాలోలేని చిన్నికి ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం. తూర్పు సర్కిల్‌లో ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద ఏటా జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడం, ఎమ్మెల్యే, ఎంపీలైన గద్దె, కేశినేని కలిసి పాల్గొనడం ఆనవాయితీ.

వారితో పాటు పార్టీ ముఖ్యులు, సీనియర్లు ఉంటారు. తాజా కార్యక్రమానికి ఎంపీని కాకుండా చిన్నిని గద్దె ఆహ్వానించి కార్యక్రమాన్ని నిర్వహింపజేయడం పరిశీలనాంశం. విజయవాడ వెస్ట్‌ బాధ్యతలు నానికి పార్టీ అప్పగించినప్పటికీ అక్కడి బుద్దా వెంకన్న, నాగుల్‌మీరా తదితరులవి వేరు కుంపట్లే. మైలవరం ఇన్‌చార్జ్జి దేవినేని ఉమ ఎంపీ కేశినేని మధ్య తొలి నుంచీ విభేదాలే. గొల్ల పూడి వన్‌సెంటర్‌లో కార్యక్రమంలో నాని కనిపించలేదు. తిరువూరులో పార్టీ నియమించిన ఇన్‌చార్జ్జి, నానికి మద్దతుగా ఉంటున్న వారు వైరి వర్గాలుగా కొనసాగుతున్నారు. నందిగామలోనూ దాదాపు ఇదే పరిస్థితి. జగ్గయ్యపేట ఇన్‌చార్జి శ్రీరాం తాతయ్య, ఎన్టీఆర్‌ జిల్లా పార్టీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం మాత్రం నానితో సఖ్యతతో ఉంటున్నారు.

వాళ్లేంటి నన్ను పిలిచేది : కేశినేని
పార్టీ కార్యక్రమాల్లో మీరెక్కడ? హాజరుకావడం లేదా? పిలుపులే లేవా? అని ఎంపీ కేశినేని వద్ద ప్రస్తావించగా వాళ్లేంటి నన్ను పిలిచేది అని ఘాటుగా స్పందించారు. అన్ని నియోజకవర్గాల్లో నన్ను నన్నుగా అభిమానించే నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా ప్రజలు ఉన్నారు. వారితోనే నా కార్యక్రమాలని స్పష్టం చేశారు. ఏటా ఎన్టీఆర్‌ సర్కి ల్‌ వద్ద జరిగే కార్యక్రమాల్లో గద్దెతో పాటు పాల్గొనేవాడిని. ఈ దఫా ఉద్దేశపూర్వకంగానే ఆహ్వానించ లేదని అర్థమైంది. ఛీటర్‌తో కలిసి పాల్గొన్నారు. అందుకే ఎంపీ లాడ్స్‌ నుంచి ఇచ్చిన రూ.7 కోట్ల నిధులను నిలిపేయాలని అధికారులకు సూచించా. వాటిని ఇతర అభివృద్ధి పనులకు కేటాయించా. దాదాపు రూ.2.90 కోట్లతో 116 గ్రామాలకు వాటర్‌ ట్యాంకర్స్‌ కోసం ఇచ్చా. పార్టీ రహితంగా అడిగిన ఎమ్మెల్యేలకు నిధుల కేటాయింపు జరిగింది. మైలవరంలో ఓ పెద్దమనిషి పాఠశాల అభివృద్ధికి నిధు లవసరమనగానే రూ.60 లక్షలు మంజూరు చేయా లని కలెక్టరును కోరా. పార్టీలో పరిణామాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లలేదా అని అడగ్గా వారికి తెలియకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా? అని ఎంపీ ప్రశ్నించడం పరిశీలనాంశం.

పిలుపే బంగారమాయెనే..
కేశినేని శ్రీనివాస్‌ విజయవాడ లోక్‌సభ సభ్యుడు. టీడీపీ తరఫున వరుసగా రెండు పర్యాయాలు గెలుపొందారు. సిట్టింగ్‌ ఎంపీ. అయినప్పటికీ నియోజకవర్గ స్థాయి పార్టీ కార్యక్రమాలకు నానికి కనీస పిలుపు ఉండటం లేదు. ఆయనకు స్వయానా సోదరుడైన కేశినేని శివనాథ్‌ (చిన్ని)కు నియోజకవర్గాల ఇన్‌చార్జుల నుంచి ఆహ్వానాలే కాదు, నిలువెత్తు ఫ్లెక్సీలు, ఫొటోలతో ప్రాధాన్యతలు, స్వాగత తోరణాలు విజయవాడ లోక్‌సభ పరిధిలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కనిపిస్తున్నాయి.

షరతులతో జాస్తికి రూ.1.20 కోట్లు
తూర్పు నియోజకవర్గంలోని నాలుగో డివిజన్‌ కార్పొరేటర్‌గా టీడీపీకి చెందిన జాస్తి సాంబశివరావు ఉన్నారు. ఆ డివిజన్‌లో అభివృద్ధి పనులకు రూ.1.20 కోట్లను ఎంపీ లాడ్స్‌ నుంచి నాని కేటాయించారు. ఆయా పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ను ఆహ్వానించకూడదనే షరతు పెట్టారు. అందుకు అంగీకరిస్తేనే పనులు చేయించాలని నాని స్పష్టంగా చెప్పగా జాస్తి అంగీకరించడం విశేషం.

బొండా పొలిట్‌బ్యూరో సభ్యుడైనా...
విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం మూడు రోజుల కిందట జరిగింది. నియోజకవర్గ ఇన్‌చార్జి బొండా ఉమామహేశ్వరరావు నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి సిట్టింగ్‌ ఎంపీ కేశినేని నానికి పిలుపు లేదు. ఫ్లెక్సీల్లో, స్వాగత తోరణాల్లో, మరెక్కడా కాని ఆయన పేరు, ఫొటో మచ్చుకు కనిపించలేదు. కానీ చిన్నికి అన్నింటా ప్రాధాన్యమే. బొండా నియోజకవర్గ ఇన్‌చార్జే కాదు, పొలిట్‌ బ్యూరో సభ్యుడు, స్ట్రాటజీ కమిటీ మెంబర్‌ కూడా. పారీ్టకి అన్ని విధాలా మార్గదర్శనం చేసే ఉన్నతస్థాయి కమిటీల్లోని సభ్యుడే ఇలా వ్యవహరిస్తే సంస్థాగతంగా నాయకులు, కార్యకర్తలకు వీరేమి సూచనలు చేయగలరని సీనియర్‌ నేతలు ప్రశ్నిస్తున్నారు.

గద్దెకు ఇచ్చిన రూ.7 కోట్లు వెనక్కు
విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే      గద్దె రామ్మోహన్‌ అభ్యర్థన మేరకు వివిధ అభివృద్ధి పనులకు రూ.7 కోట్లను తన ఎంపీ లాడ్స్‌ నుంచి కేశినేని నాని కేటాయించారు. కార్పొరేషన్‌ కమిషనర్‌ నుంచి పనుల ప్రతిపాదనలు అందాయి. జిల్లా కలెక్టరు అనుమతులు మంజూరు చేసే సమయంలో ఎంపీ నిలుపుదల చేయించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement