నేత కార్మికుల సంక్షేమం కోసమే ఏఐడబ్ల్యూఎఫ్
పెడన: చేనేత కార్మికుల సంక్షేమం కోసం ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ నిరంతరం పనిచేస్తుందని ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు, పెడన మున్సిపల్ మాజీ చైర్మన్ బండారు ఆనందప్రసాద్ అన్నారు. పట్టణంలోని శ్రీవిఘ్నేశ్వర ప్రార్థన మందిరంలో శుక్రవారం గుంటూరు జిల్లా పెదకాకాని శంకర్ నేత్రాలయ వారి సహకారంతో ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్యశిబిరాన్ని నిర్వహించారు. తొలుత శిబిరాన్ని నేత్రాలయం వైద్యురాలు షెఫాలి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆనందప్రసాద్ మాట్లాడుతూ నేత కార్మికులు నేత నేసే సమయంలో సన్నని దారపు పోగులు సక్రమంగా చూసుకోవాల్సి ఉంటుందని, కంటి చూపు తీక్షణంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. నేత కార్మికులకు చూపు బాగుంటేనే నేత బాగా నేయగలరని, ఈ ఉద్దేశంతోనే తాము ఫెడరేషన్ ఆధ్వర్యంలో తొలిసారిగా పెడనలో కంటి వైద్య శిబిరం పెట్టామన్నారు. భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాల్లో శిబిరాలు నిర్వహిస్తామని చెప్పారు. నేత కార్మికులే కాకుండా ఇతర వృత్తుల వారు కూడా ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. నేత్రాలయం వారు ఉచితంగా ఆరోగ్యశ్రీపై వైద్య పరీక్షలు చేయడమే కాకుండా శస్త్రచికిత్సలు కూడా చేస్తారన్నారు. ఇప్పటి వరకు నేత్రాలయం వారు 2,500కు పైగా శిబిరాలను ఏర్పాటు చేయడమే కాకండా 4 లక్షల మందికి శస్త్రచికిత్సలను అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఇనమాల శివరాంప్రసాద్, జాతీయ కార్యవర్గ సభ్యుడు పిల్లలమర్రి నాగేశ్వరరావు, కృష్ణాజిల్లా అధ్యక్షుడు పిచ్చుక ఫణికుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకురాతి జనార్దనరావు, కోశాధికారి తాళ్ల బాలాజీ, నేత్రాలయం క్యాంపు ఇన్‌చార్జి రవి, ఫెడరేషన్ నాయకులు కట్టా హేమసుందరరావు, దేవాంగ సంక్షేమ సంఘ యువజన విభాగం ఉపాధ్యక్షుడు ఊటుకూరి సుధీర్‌కుమార్, భళ్ల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. శిబిరంలో 123 మంది ఓపీలో నమోదు అవగా 49 మందికి శస్త్రచికిత్సలు అవసరమని గుర్తించి మొదటి విడతలో 17 మందిని పెదకాకాని తరలించినట్లు ఫెడరేషన్ వారు తెలిపారు.
ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు బండారు ఆనందప్రసాద్ పెడనలో ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహణ
Comments
Please login to add a commentAdd a comment