ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మకు పూర్వ జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం దంపతులు వెండి పంచపాత్రను సమర్పించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు లక్ష్మీకాంతం దంపతులు ఆలయానికి విచ్చేయగా, వారికి ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అధికారులను కలిసి సుమారు రెండు కిలోల వెండితో తయారు చేయించిన పంచపాత్రను అందజేశారు. లక్ష్మీకాంతం దంపతులకు అధికారులు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు.
మంగినపూడి బీచ్‌లోకి 300 ఆలివ్ రిడ్లే తాబేలు పిల్లలు
కోనేరుసెంటర్: కృష్ణాజిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మచిలీపట్నం మండలం తాళ్లపాలెం పంచాయతీ పరిధిలోని గిరిపురం బీచ్‌లోకి 300 ఆలివ్ రిడ్లె తాబేలు పిల్లలను అటవీశాఖ, మైరెన్ పోలీసులు వదిలారు. బందరు మండల కేంద్రంలో మొట్ట మొదటిసారిగా ఏర్పాటు చేసిన ఆలివ్ రిడ్లే తాబేలు గుడ్ల సంరక్షణ కేంద్రంలో సంరక్షిస్తున్న గుడ్ల సంతాన ఉత్పత్తి కేంద్రం నుంచి గురువారం 300 పిల్లలు గుడ్ల నుంచి బయటకు రాగా వాటిని సముద్రంలోకి వదిలారు. కార్యక్రమంలో అటవీశాఖ రేంజర్ సాయి, సంరక్షణకేంద్రం ఇన్‌చార్జి ఒ.నాగరాజు, గిలకలదిండి మైరెన్ ఎస్‌ఐలు వి.జె.చంద్రబోస్, పరింకాయల మురళీకృష్ణ, స్టేషన్ రైటర్ మద్దియ్య, ఆలివ్ రిడ్లె తాబేలు పిల్లల సంరక్షణ కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.
హాకీ జిల్లా జట్టు ఎంపిక
విజయవాడస్పోర్ట్స్: రాష్ట్ర స్థాయి జూనియర్ బాలుర హాకీ పోటీలకు ప్రాతినిధ్యం వహించే జిల్లా జట్టును ఎంపిక చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా హాకీ సంఘం కార్యదర్శి కె.రాజశేఖర్ తెలిపారు. సింగ్‌నగర్‌లోని ఎంబీపీ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన ఎంపిక పోటీల్లో అత్యుత్తమ క్రీడా నైపుణ్యం ప్రదర్శించిన చరణ్‌రాజ్, సునీల్‌కుమార్, విశ్వతేజనూతన్, నితిన్‌రాజ్, హరివినయ్, చిరంజీవిఏసురాజు, సూర్య, దినేష్‌సాయిరామ్, ప్రవీణ్, మున్నర్ వలీ, భార్గవ్, అశోక్, జస్వంత్, జగదీష్‌బాబు, అమీర్, యాసిన్, హర్షలను జట్టుకు ఎంపిక చేశామన్నారు. ఈ నెల ఆరు నుంచి తొమ్మిదో తేదీ వరకు శ్రీసత్యసాయి జిల్లాలోని ధర్మవరంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో ఈ జట్టు పాల్గొంటుందన్నారు.
1,23,485 బస్తాల మిర్చి విక్రయం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు శుక్రవారం 1,13,955 బస్తాల మిర్చి రాగా గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,23,485 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,500 నుంచి రూ.14,000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.10,000 నుంచి రూ.13,500 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.4,500 నుంచి రూ.6,300 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 47,777 బస్తాలు నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక తెలిపారు.

దుర్గమ్మకు వెండి పంచ పాత్ర బహూకరణ