
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం
కృష్ణలంక(విజయవాడతూర్పు): విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో కృష్ణలంక జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బస్సు అగ్నికి ఆహుతైంది. బస్సులో ప్రయాణికులు ఎవ్వరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు.. విజయవాడకు చెందిన ఓ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ వెళ్లే క్రమంలో ప్రయాణికులను ఎక్కించుకునేందుకు గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో వారధి వైపు నుంచి జాతీయ రహదారి గుండా భవానీపురం వెళ్తోంది. బస్టాండ్ సమీపానికి చేరుకోగానే బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దానిని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును పక్కన ఆపాడు. క్షణాల్లో మంటలు వ్యాపించి బస్సు అగ్నికి ఆహుతైంది. బస్సులో నుంచి మంటలు ఎగిసిపడటాన్ని చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. బస్సులో ప్రయాణికులెవ్వరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అంతా ఊపిరి పీల్చుకున్నారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించడంతో ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని ఫైర్ సిబ్బంది, పోలీసులు భావిస్తున్నారు.