
స్వచ్ఛాంధ్రతో పరిశుభ్రంగా గ్రామాలు
మైలవరం: స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి లావణ్యకుమారి తెలిపారు. మైలవరం ఎస్వీఎస్ కల్యాణ మండపంలో గ్రామ పంచాయతీ, వెలుగు కార్యాలయం ఆధ్వర్యంలో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విచ్చల విడిగా ప్లాస్టిక్ వస్తువులు వినియోగించడం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని చెప్పారు. క్యారీ బ్యాగులు ఎక్కడబడితే అక్కడ పడేయడంతో భూమి ఉపరితలంలో పేరుకుపోతున్నాయని తెలిపారు. దీంతో వర్షపు నీటిని భూమి పీల్చుకోలేకపోతుందని పేర్కొన్నారు. వాడిన ప్లాస్టిక్ వస్తువులను పంచాయతీ పారిశుద్ధ్య వాహనం వచ్చినపుడు అప్పగిస్తే వాటిని దూరంగా డంప్ చేస్తారని వెల్లడించారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుహాసిని మాట్లాడుతూ పరిసరాలు శుభ్రంగా ఉంచకుని ఆరోగ్యవంతమైన గ్రామాలను తీర్చిదిద్దుకోవాలని సూచించారు. రోగం వచ్చాక మందులు వాడేకన్నా రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం మేలన్నారు. జిల్లా మలేరియా అధికారి డాక్టర్ మోతి బాబు మాట్లాడుతూ ఇళ్లలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ వినియోగం తగ్గిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. పంచాయతీ కార్మికులను సత్కరించారు. తహసీల్దారు అబ్దుల్ ధారియా, సర్పంచ్ మంజుభార్గవి, తదితరులు పాల్గొన్నారు. మైలవరం లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజినీరింగ్ ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఈ వేస్ట్ కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ కె.అప్పారావు, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ బి. శివహరిప్రసాద్, ఉమామహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పంచాయతీ అధికారి లావణ్యకుమారి