
అద్భుతం.. హంసలదీవి సాగరతీరం
కుటుంబసభ్యులతో కలిసి తీరంలో సేదతీరిన జేసీ గీతాంజలి శర్మ
కోడూరు: ప్రకృతి రమణీయ దృశ్యాలకు నెలవైన హంసలదీవి సాగరతీరం అద్భుతంగా ఉందని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ అన్నారు. కుటుంబసభ్యులతో కలిసి జేసీ సాగరతీరాన్ని శనివారం వేకువజామున సందర్శించారు. పాలకాయతిప్ప శింకు నుంచి పవిత్ర కృష్ణా, సాగర సంగమం వరకు పడవ ప్రయాణం చేసి ప్రకృతి అందాలను తిలకించారు. మడచెట్ల వివరాలను అటవీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సాగర సంగమ విశిష్టతను రెవెన్యూ అధికారులు జేసీకి వివరించారు. అక్కడ కొంతసేపు సేదతీరి పాలకాయతిప్ప బీచ్‌లో పర్యటించారు. అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తాబేళ్ల సంతానోత్పత్తి కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కేంద్రంలో ఉత్పత్తి అయిన తాబేళ్ల పిల్లలను కుటుంబ సభ్యులతో కలిసి జేసీ సముద్ర బాట పట్టించారు. తాబేళ్ల పిల్లలు సముద్రం వైపు బుడిబుడి అడుగులు వేసుకుంటూ వెళ్తున్న దృశ్యాలను కెమెరాల్లో బంధించారు. పర్యావరణ విజ్ఞాన కేంద్రంలో ఉన్న వివిధ రకాల జీవరాశుల నమునాలను ఆసక్తిగా తిలకించారు. మైరెన్ ఎస్‌ఐ పూర్ణమాధురి, రెవెన్యూ, అటవీ, పంచాయతీరాజ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.