
‘అప్పులు సాకుగా చూపి పథకాలు ఎగ్గొట్టేందుకు కుట్ర’
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అప్పులు సాకుగా చూపి సూపర్ సిక్స్ పథకాలు ఎగ్గొట్టేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర అఽధికార ప్రతినిధి పి.ప్రసాద్ అన్నారు. సంపద సృష్టించి సూపర్‌సిక్స్ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారం చేపట్టి 11 నెలలు కావొస్తున్నా ఏ ఒక్క పథకం అమలు చేయలేదన్నారు. విజయవాడ అలంకార్ సెంటర్‌లోని ధర్నా చౌక్ సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో సూపర్‌సిక్స్ పథకాలు అమలు చేయాలని కోరుతూ సోమవారం ధర్నా నిర్వహించారు. ధర్నాలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే నవరత్నాలకు మించిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని ప్రజలను నమ్మించి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిందన్నారు. సూపర్ సిక్స్ హామీలతో పాటు ఇతర వర్గాలకు 176 అడ్డగోలు హామీలిచ్చిందన్నారు. అప్పుల పేరుతో ఈ పథకాల ఎగవేతకు పథకం పన్నడం ప్రజాద్రోహమని విమర్శించారు.
క్విడ్ ప్రోకోగా..
రైతులకు ఇచ్చిన హామీల్ని వదిలి భారీ భూభాగాల్ని క్విడ్ ప్రొకోగా కంపెనీలకు కట్టబెడుతున్నారని గుర్తు చేశారు. ప్రజలు ఏమీ చేయరని చంద్రబాబు భావిస్తే.. ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజు దూరంలోనే లేదని ప్రసాద్ హెచ్చరించారు. పార్టీ నగర కార్యదర్శి పి.పద్మ, ఇఫ్టూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ముని శంకర్, దాది శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.