
కనీస సౌకర్యాలు కరువు
పెడన: కృష్ణా జిల్లాలోని నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తిపన్ను కట్టించుకునే అస్సెస్‌మెంట్లు పెరుగుతున్నా మౌలిక వసతుల కల్పనలో ఆయా పురపాలక సంఘాలు, కార్పొరేషన్లు వెనుకంజ వేస్తున్నాయి. ఆదాయ మార్గాలు అన్వేషించకుండానే ఆస్తి పన్నుల రూపంలో ఆదాయానికి ఆస్కారం ఏర్పడుతోంది. అయితే ఆస్తి పన్నులు వసూలు చేయడంలోనే అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రైవేటు ఆస్తి పన్నుల జోలికి పోకుండా అధికార యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తున్నారనే ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరో పక్క అస్సెస్‌మెంట్ల సంఖ్య నగరాలలోను, పట్టణాల్లోనూ ప్రతి సంవత్సరం వేలల్లో పెరుగుతోంది. చిన్న మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో మాత్రం ఈ సంఖ్య వందల్లోనే పెరుగుతోంది.
ఆదాయాన్ని బట్టి అభివృద్ధికి నిధులు కేటాయింపా?
ఒక పక్క కార్పొరేషన్లలోను, మున్సిపాలిటీల్లోను, నగర పంచాయతీలలో అస్సెస్‌మెంట్ల ద్వారా ఆదాయం పెరుగుతూ వస్తోంది. అయితే వసూళ్లు చేయడంలో బాగా వెనుకబడుతున్నారనే విమర్శలున్నాయి. కచ్చితంగా వసూలు చేస్తే మౌలిక వసతులు కూడా కల్పించడానికి వీలవుతుందనే వాదన కొందరి నుంచి వ్యక్తమవుతోంది. పూర్తి స్థాయిలో వసూళ్లు చేయకపోవడం వల్ల పెండింగ్ పడుతూ వస్తుండటంతో మౌలిక వసతులకు ఈ నిధులు కేటాయించలేక పోతున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. ఆదాయాన్ని బట్టి అభివృద్ధికి నిధులు కేటాయింపు అంటే కొన్ని పురపాలక సంఘాలు, మున్సిపాలిటీలు ఇప్పుడిప్పుడే అభివృద్ధి సాధించలేవనే వాదన కూడా వ్యక్తమవుతోంది. ఆదాయాన్ని బట్టి కాకుండా అన్ని పట్టణాలు, నగరాలను సమాన దృష్టితో చూసి అభివృద్ధి చేయాలని పురప్రజలు కోరుతున్నారు.
పట్టణాల్లో పెరుగుతున్న అస్సెస్‌మెంట్లు పన్నుల వసూళ్లలో మాత్రం వెనుకంజ పారిశుద్ధ్యం, డ్రైనేజీ, తాగునీటి వసతుల కల్పనలో అశ్రద్ధ 2024–25లో మచిలీపట్నం కార్పొరేషన్‌లో 52,570కి చేరిన ఆస్తి పన్నులు గుడివాడలో 29,384...పెడనలో 7578కు చేరిన అస్సెస్‌మెంట్లు
కృష్ణాజిల్లాలో గత రెండేళ్లుగా పెరిగిన అస్సెస్‌మెంట్లు
కార్పొరేషన్/మున్సిపాలిటీ 2023–24 2024–25 పెరిగినది
మచిలీపట్నం 48,272 52,570 4,298
గుడివాడ 26,258 29,384 3,126
తాడిగడప 44,671 48,006 3,335
ఉయ్యూరు 9,911 10,119 208
పెడన 7,234 7,578 344
మౌలిక వసతులు మృగ్యం
ఉయ్యూరు నగర పంచాయతీలో ప్రొపర్టీ ట్యాక్స్ 2024–25 ఏడాదిలో 10,119కి చేరింది. కాని తాగునీటి వసతి పూర్తి స్థాయిలో కల్పించలేకపోతున్నారు. పెడన పురపాలక సంఘంలో ఆస్తి పన్నులు కట్టించుకునే అస్సెస్‌మెంట్లు పెరుగుతున్నా పారిశుద్ధ్య సిబ్బంది అందుకు తగ్గ విధంగా లేరు. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదు. కనీస మౌలిక వసతులు కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
మౌలిక వసతుల విషయం ప్రభుత్వమే చూసుకోవాలి
ఆస్తి పన్నుల ద్వారా అస్సెస్‌మెంట్లు పెరిగి ఆదాయం పెరుగుతున్నా అందుకు తగ్గ వ్యయం మాత్రం రెట్టింపుగా ఉంటోంది. సిబ్బంది జీతాలతో పాటు విద్యుత్ బిల్లులు, సచివాలయాల అద్దెలు వంటి వాటికే మున్సిపల్ జనరల్ ఫండ్స్ నిధులు సరిపోతున్నాయి. ఇక మౌలిక వసతుల విషయం ప్రభుత్వమే చూసుకోవాలి.
– పి.వెంకటేశ్వరరావు, ఆర్‌ఐ, పెడన

కనీస సౌకర్యాలు కరువు