
డీఎస్సీ నిబంధనలు సడలించాలి
డీవైఎఫ్‌ఐ ధర్నా
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): డీఎస్సీ నోటిఫికేషన్‌లో అనేక లోపాలు ఉన్నాయని, నిబంధనలు సడలించి అభ్యర్థులకు న్యాయం చేయాలని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.రామన్న డిమాండ్ చేశారు. శుక్రవారం విజయవాడ అలంకార్ సెంటర్‌లోని ధర్నా చౌక్‌లో డీఎస్సీ అభ్యర్థులతో కలిసి డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యాన ధర్నా జరిగింది. ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీలను డీఎస్సీకి అనర్హులు చేసే నిబంధనలు తొలగించాలని డిమాండ్ చేశారు. ఇంటర్, డిగ్రీ, పీజీలో 45, 50 శాతం మార్కులు ఉండాలన్న నిబంధనను తొలగించాలన్నారు. తెలంగాణలో సైతం 40 శాతానికి అనుమతి ఇచ్చారని గుర్తు చేశారు. సిలబస్ విస్తృతిరీత్యా అభ్యర్థుల ప్రిపరేషన్‌కు 90 రోజులు సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ, ఏపీపీఎస్సీ పరీక్షలు ఒకే సమ యంలో లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఒకే జిల్లాకు ఒకే పేపర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అభ్యర్థుల వయోపరిమితి 47 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. డీఎస్సీకి అప్లై చేసుకోడానికి ఇచ్చిన వెబ్ సైట్స్, టోల్ ఫ్రీ నంబర్లు పని చేయడం లేదన్నారు. కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు వై.రాము, జిల్లా అధ్యక్షుడు పి. కృష్ణ, సెంట్రల్ సిటీ అధ్యక్షుడు శివ, పలువురు అభ్యర్థులు పాల్గొన్నారు.