
ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): చైత్రమాసం.. పెద్ద ఎత్తున జరుగుతున్న వివాహాలు, వేసవి సెలవుల నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి దుర్గామల్లేశ్వరస్వామివార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే దుర్గామల్లేశ్వరస్వామివార్లకు నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. అంతరాలయంలో ప్రధాన మూలవిరాట్ వద్ద ఖడ్గమాలార్చన, ఆలయ ప్రాంగణంలో జరిగిన లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన, చండీహోమం, శాంతి కల్యాణం, నవగ్రహ హోమం, గణపతి హోమాల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. ఉదయం నుంచే భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అంతరాలయ దర్శనాన్ని రద్దు చేశారు. రూ. 300 టికెట్‌పై ముఖ మండప దర్శనాన్ని కల్పించిన ఆలయ అధికారులు, రూ. 100, సర్వ దర్శనం క్యూలైన్లలో భక్తులు ముందుకు కదిలేలా చర్యలు తీసుకున్నారు. మధ్యాహ్నం మహా నివేదన అనంతరం భక్తుల రద్దీ మరింత పెరిగింది. ఎండల నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీ గణపతి ప్రాంగణం, మైక్ అనౌన్స్ పాయింట్ వద్ద దేవస్థానం భక్తులకు మజ్జిగను పంపిణీ చేసింది. సాయంత్రం అమ్మవారికి పంచహారతుల సేవ, పల్లకీ సేవలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు.
వేసవి సెలవులు నేపథ్యంలో పెరిగిన సందడి అంతరాలయ దర్శనాలు రద్దు

ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ

ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ