
వారంలో పెళ్లి.. విద్యుదాఘాతంతో యువకుడి మృతి
తాళ్లూరు(వత్సవాయి): పది రోజుల్లో వివాహం చేసుకుని సంతోషంగా జీవితాన్ని గడపాల్సిన యువకుడు విద్యుదాఘాతంతో మరణించిన సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల మేరకు గ్రామానికి చెందిన కంచర్ల వెంకటేశ్వర్లు, భూలక్ష్మి దంపతుల కుమారుడు జితేంద్ర(25). అతను ఆటోలో ఉల్లిగడ్డల వ్యాపారం చేస్తుండేవాడు. జితేంద్రకు ఇటీవల వివాహం నిశ్చయమైంది. వారం రోజుల్లో వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి కార్యక్రమాల ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. గురువారం రాత్రి సమయంలో ఇంట్లో ఉన్న కూలర్‌లో నీళ్లు పోస్తున్నాడు. ఈ క్రమంలో అతనికి ఒక్కసారిగా కరెంట్ షాకు కొట్టడంతో అపస్మాకరకస్థితిలోకి వెళ్లాడు. కుటుంబసభ్యులు, ఇరుగుపొరుగు వారు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. పదిరోజుల్లో వివాహం చేసుకుని ఘనంగా ఊరేగింపు చేసుకోవాల్సిన తరుణంలో ఇలా అంతిమయాత్ర చేసుకోవాల్సి వచ్చిందని గ్రామస్తులు వాపోతున్నారు. ఘటనపై తల్లి భూలక్ష్మి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్‌ఐ పి.ఉమామహేశ్వరరావు కేసు నమోదు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టమ్ నిర్వహించి కుటుంబసభ్యులకు అందజేశారు.