ఆదోనిఅర్బన్/ఆదోనిటౌన్: లంచం తీసుకుంటూ ఆదోని మున్సిపల్ కార్యాలయ ఉద్యోగులు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. మున్సిపల్ మేనేజర్ విజయభాస్కర్‌రెడ్డి, జూనియర్ అసిస్టెంట్లు మహాలక్ష్మి, చరణ్ నుంచి రూ.10 వేలు స్వాధీనం చేసుకుని, వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ వెంకటాద్రి తెలిపిన వివరాల మేరకు.. ఆదోని పట్టణం అరుంజ్యోతినగర్ ఆదిఆంధ్ర మున్సిపల్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శ్రీనివాసులు గతంలో కొన్ని కారణాలతో సస్పెండ్ అయ్యాడు. వేతనం రాకపోవడంతో నాన్–డ్రాయల్ సర్టిఫికెట్ కోసం మున్సిపల్ కార్యాలయంలో మేనేజర్ భాస్కర్‌రెడ్డి, జూనియర్ అసిస్టెంట్లు మహాలక్ష్మి, చరణ్‌ను ఆశ్రయించాడు.
సర్టిఫికెట్ కోసం రూ.30 వేలకు డీల్ కుదుర్చుకున్నాడు. మొదట విడతగా రూ.5 వేలు ఇచ్చి, రెండో విడత సోమవారం రూ.10 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దాడుల్లో సీఐలు తేజేశ్వర్‌రావు, కృష్ణారెడ్డి, వంశీనాథ్, ఇంతియాజ్‌బాషా, క్రిష్ణయ్య, ఎస్‌ఐ సుబ్బరాయుడు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు జరుగుతున్న సమయంలో కమిషనర్ రఘునాథ్‌రెడ్డి వచ్చి అక్కడి నుంచి వెంటనే తిరిగి తప్పించుకొని వెళ్తుండగా ఏసీబీ అధికారులు చూసి ఆయన వాహనాన్ని వెంబడించారు. మున్సిపల్ కమిషనర్‌ను పిలుచుకొని కార్యాలయంలోని చాంబర్‌లో ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం అడిగితే తమకు సమాచారం ఇస్తే వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ఇందుకోసం 14400 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలన్నారు.
దొంగ సర్టిఫికెట్‌తో ఉద్యోగంలో..
ఆదిఆంధ్ర మున్సిపల్ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న శ్రీనివాసులు దొంగ సర్టిఫికెట్‌తో ఉద్యోగం సంపా దించాడనే ఆరోపణలతో సంబంధిత అధికారులు విచారణ జరిపి సస్పెండ్ చేశారు. అంతేగాకుండా ఆయన ఉద్యోగం చేసినప్పటి నుంచి ఆయనకు వచ్చిన జీతం రికవరీ చేయాలని అధికారులు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇప్పటి వరకు జీతం రావడం లేదని, మరలా జీతం పొందేందుకు అవసరమైన క్లియరెన్స్ కోసం నాన్–డ్రాయల్ సర్టిఫికెట్ పొందేందుకు మున్సిపల్ అధికారులతో ఆయన రూ.30 వేలు డీల్ కుదుర్చుకున్నాడు. అందులో భాగంగా రూ.5 వేలు అందజేశాడు. రెండో విడతలో డబ్బు ఇచ్చే సమయంలో అవినీతి అధికారులను ఆశ్రయించాడు.
Comments
Please login to add a commentAdd a comment