ఆదర్శప్రాయులు దామోదరం సంజీవయ్య
కర్నూలు(అర్బన్): నేటి యువతరానికి మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ఆదర్శప్రాయులని జిల్లా కలెక్టర్ రంజిత్‌బాషా అన్నారు. శుక్రవారం దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా స్థానిక నంద్యాల చెక్‌పోస్టు కూడలిలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ దామోదరం సంజీవయ్య దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారన్నారు. సమాజానికి స్ఫూర్తి ప్రదాత అయిన సంజీవయ్య జిల్లాలోని పెద్దపాడు గ్రామంలో 1921 ఫిబ్రవరి 14వ తేదీన నిరుపేద కుటుంబంలో జన్మించారన్నారు. కార్మిక శాఖా మంత్రిగా ఉన్న సమయంలో ఆయన బోనస్‌లు ప్రకటించారని, వృద్ధాప్య పెన్షన్‌ను ప్రవేశ పెట్టారన్నారు. కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరును పెట్టాలని, నన్నూరు సమీపంలో కేటాయించిన స్థలంలో ఆయన స్మృతివనం ఏర్పాటు చేసే అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి హోదాలో సంజీవయ్య ఆరు లక్షల ఎకరాల బంజరు భూములను పేదలకు పంచారన్నారు. గాజులదిన్నె ప్రాజెక్టును ఏర్పాటు చేసి సాగు, తాగు నీటి ఇబ్బందులను తొలగించారన్నారు. సభలో సంజీవయ్య అన్న కుమారుడు దామోదరం రాధాకృష్ణను జిల్లా కలెక్టర్ ఘనంగా సన్మానించారు. అలాగే వివిధ పాఠశాలల్లో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలైన విద్యార్థినులకు బహుమతులు అందించారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దామోదరం సంజీవయ్య చిత్ర పటానికి కలెక్టర్ రంజిత్‌బాషా పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో పాణ్యం, కోడుమూరు ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, బొగ్గుల దస్తగిరి, కర్నూలు ఆర్‌డీఓ కిడారి సందీప్‌కుమార్, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ తులసీదేవి, బీసీ కార్పొరేషన్ ఈడీ జాకీర్‌హుసేన్, దూరదర్శన్ డైరెక్టర్ రంగస్వామి, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ మంజునాథ్, పలు దళిత, ప్రజా సంఘాల నాయకులు కాసారపు వెంకటేష్, ధరూర్ జేమ్స్, ఆర్ చంద్రప్ప, వై రాజు, నాయకల్లు సోమసుందరం, ఆర్ రాజ్‌కుమార్, చిటికెల సామేల్, వీ త్యాగరాజు, ఆర్ కై లాస్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ రంజిత్‌బాషా
ఆదర్శప్రాయులు దామోదరం సంజీవయ్య
Comments
Please login to add a commentAdd a comment