బ్యాంకుల సమ్మెను విజయవంతం చేద్దాం
కర్నూలు (అగ్రికల్చర్): వచ్చే నెల 24, 25 తేదీల్లో చేపట్టే ఆలిండియా బ్యాంకుల సమ్మెను విజయవంతం చేయాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) నేతలు పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం కర్నూలు గాయత్రి ఎస్టేట్‌లోని ఎస్‌బీఐ బ్రాంచ్ ఎదుట ముందస్తుగా యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా యూఎఫ్‌బీయూ జిల్లా కన్వీనర్ నాగరాజు మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. పలు దఫాలుగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దృష్టికి సమస్యలు తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో విధి లేని పరిస్థితుల్లో సమ్మెకు దిగినట్లు పేర్కొన్నారు. అన్ని బ్యాంకుల్లో పని ఒత్తిడి తగ్గించేందుకు తగిన స్థాయిలో నియామకాలు చేపట్టాలని, ఐదు రోజుల పనిదినాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న వివిధ సమస్యలను తక్షణం పరిష్కరించాలని, ఔట్ సోర్సింగ్‌పై ఉద్యోగ నియామకాలను బంద్ చేయాలని కోరారు. వివిధ డిమాండ్లను సాధించుకునేందుకు చేపట్టిన రెండు రోజుల బ్యాంకుల సమ్మెను అన్ని బ్యాంకుల ఉద్యోగ సంఘాలు కలిసికట్టుగా పనిచేసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐబీఈఏ నాయకులు శివకృష్ణ, ఎల్లయ్య, అనిల్‌రెడ్డి, ఏఐబీఓసీ నాయకులు రహిమాన్, మురళీకృష్ణ, అనిల్, ఎన్‌సీబీఈ నాయకులు విద్యాసాగర్, శ్రీకాంత్, ఏపీజీబీ యూనియన్ నాయకులు హనుమంతురెడ్డి తదితరులు పాల్గొన్నారు.
యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్
యూనియన్స్ డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment