
కేఎంసీ మానవతా విలువలు నేర్పింది
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కళాశాల ఎంతో మందికి మానవతా విలువలు నేర్పిందని రిటైర్డ్ డీజీపీ డాక్టర్ డీటీ నాయక్ అన్నారు. కర్నూలు మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థుల సంఘం(అలుమ్ని) ఆధ్వర్యంలో రెండురోజుల పాటు నిర్వహించే నిరంతర వైద్యవిజ్ఞాన సదస్సు, అలుమ్ని మీట్ శనివారం కళాశాలలో ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా హాజరైన కేఎంసీ పూర్వ విద్యార్థి డాక్టర్ డీటీ నాయక్ మాట్లాడుతూ తాను ఈ జిల్లాకు చెందినవాడినేనని, అందుకే ఈ ప్రాంతమంటే తనకు ప్రత్యేక అభిమానముందన్నారు. త్యాగమంటే ఈ ప్రాంతం వారిదేనన్నారు. ఏకంగా రాజధానినే ఈ ప్రాంతం త్యాగం చేసిందని, అందుకే ప్రతిఫలంగా కేఎంసీ దక్కిందన్నారు. ఇక్కడ చదివిన విద్యార్థులు దేశ విదేశాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారని, ఎక్కడికి వెళ్లినా కేఎంసీ పేరు వినిపిస్తుందని తెలిపారు. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ సాధించిన డాక్టర్ నాగేశ్వరరెడ్డి కూడా ఈ కళాశాల పూర్వ విద్యార్థి కావడం తనకు ఎంతో గర్వంగా ఉంటుందన్నారు.
● మాజీ ఎంపీ డాక్టర్ ఎంవీ మైసూరారెడ్డి మాట్లాడుతూ తాను నాలుగు దశాబ్దాల క్రితం 1966 బ్యాచ్ ఎంబీబీఎస్ విద్యార్థిగా ఈ కాలేజీలో చదివాననన్నారు. అప్పట్లో వైద్యవిద్యార్థి సంఘం నాయకునిగా తాను ఎన్నికై నట్లు గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో ఎన్నో నాయకత్వ విలువలు నేర్చుకున్నట్లు పేర్కొన్నారు.
● అమెరికాలో స్థిరపడిన పూర్వ విద్యార్థి, గైనకాలజిస్టు డాక్టర్ గురురాజ మాట్లాడుతూ ఈ కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు సహకరించాలని, ఒక్కరు ఇవ్వడం మొదలు పెడితే అందరూ ముందుకు వస్తారని సూచించారు.
● కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ మాట్లాడుతూ ఈ కళాశాల 50 సీట్ల నుంచి 250 ఎంబీబీఎస్ సీట్లకు చేరుకుందని, పీజీ సీట్లు కూడా ప్రస్తుతం స్పెషాలిటీ 175, సూపర్‌స్పెషాలిటీ 19 సీట్లు ఉన్నాయన్నారు.
● ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మంచి వైద్యసేవలు అందించడం పట్ల అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా వ్యాధినిర్ధారణ పరీక్షలపై ఎక్కువ దృష్టిసారించామన్నారు.
● అనంతరం దేశ, విదేశాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులచే నిరంతర వైద్య విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఆయా రంగాల్లో వారు సాధించిన ప్రగతి, ఆధునిక వైద్యవిజ్ఞానం గురించి వివరించారు.
● కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్ పి. శాంతికళ, ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ బి.కుమారస్వామిరెడ్డి, సెక్రటరి డాక్టర్ జి. బాలమద్దయ్య, సైంటిఫిక్ కమిటి మెంబర్ డాక్టర్ విక్రమకుమార్‌రెడ్డి, అలుమ్ని చైర్మన్ డాక్టర్ సదాశివారెడ్డి, అలుమ్ని పూర్వ ప్రెసిడెంట్ డాక్టర్ నరసింహులు, ట్రెజరర్ డాక్టర్ మహేశ్వరరెడ్డి, డాక్టర్ ఐ. రమేష్, డాక్టర్ సి. ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
రిటైర్డ్ డీజీపీ డాక్టర్ డీటీ నాయక్
అట్టహాసంగా అలుమ్ని మీట్ ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment