రైలు ప్రయాణం రయ్..రయ్
చార్జీలు తక్కువనో, క్షేమంగా గమ్యం చేరుకోవచ్చనో ఏమో కానీ రైళ్ల ప్రయాణానికే ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దీంతో నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వే మార్గంలో ప్రయాణికుల రద్దీ పెరిగిపోతోంది. రోజూ నడిచే డెమో కిక్కిరిసిపోతోంది. ఫలితంగా బోగీలు పెంచాలనే డిమాండ్ ప్రయాణికుల నుంచి రోజురోజుకూ పెరిగిపోతోంది.
మరిన్ని రైళ్లు నడపాలి
నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వే మార్గంలో ప్రస్తుతం ప్రతి రోజు ఒక డెమో, రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. డెమో రైలు ఉదయం, ఎక్స్‌ప్రెస్ రైళ్లు రాత్రి వేళ్లల్లో రోజులో ఒకసారి మాత్రమే తిరుగుతున్నాయి. బస్సు ప్రయాణాలకంటే రైలు ప్రయాణం చేసేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆయా జిల్లాల ప్రయాణికుల సౌకర్యార్థం ఎక్స్‌ప్రెస్ రైళ్లు పగటి వేళల్లో నడపటంతోపాటు మరిన్ని రైలు సర్వీసులను ఏర్పాటు చేయాలి. డెమో రైలుకు కూడా అదనపు బోగీలు ఏర్పాటు చేయాలి
– దస్తగిరి, సౌదరదిన్నె, కోవెలకుంట్ల మండలం
కోవెలకుంట్ల: ఉమ్మడి కర్నూలు– వైఎస్సార్ జిల్లాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు నంద్యాల నుంచి వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల వరకు 130 కిలోమీటర్ల రైల్వేలైన్ ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, ఉప్పలపాడు, నొస్సం, సంజామల, కోవెలకుంట్ల, బనగానపల్లె, మద్దూరు ప్రాంతాల్లో రైల్వేస్టేషన్లు ఉన్నాయి. రెండు జిల్లాల ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని 2016 ఆగస్టు నుంచి ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. నంద్యాల నుంచి చిత్తూరు జిల్లా రేణిగుంట వరకు డెమో, అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి రాష్ట్ర రాజధాని అమరావతి మీదుగా మచిలీపట్నం వరకు, గుంటూరు నుంచి తిరుపతికి ప్రతి రోజు ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు ఆయా జిల్లాల పారిశ్రామిక అభివృద్ధికి గూడ్స్ రైళ్లు తిరుగుతున్నాయి. ప్రయాణికులకు రైలు ప్రయాణం మరింత సులభతరం చేసేందుకు రూ.50 కోట్లతో విద్యుత్ లైన్ ఏర్పాటు చేశారు. 2023 మార్చి 29 నుంచి ఈ మార్గంలో విద్యుత్ రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. డీజిల్ ద్వారా నడిచే రైలు ప్రయాణం కంటే విద్యుత్ రైళ్లతో ప్రయాణం వల్ల సమయం ఆదా అయి త్వరగా గమ్యస్థానాలు చేరుకుంటుండటంతో ప్రజలు రైలు ప్రయాణం వైపు మొగ్గు చూపుతున్నారు.
కిక్కిరిసిపోతున్న డెమో రైలు
నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వే మార్గంలో మొదట్లో నంద్యాల ఉంచి కడప వరకు డెమో రైలు నడిచేది. రైలు రాకపోకలు ప్రారంభమైన కొన్ని నెలలకు రైలును కడప నుంచి అదే జిల్లా పెండ్లిమర్రి వరకు పొడగించారు. ప్రయాణికుల సౌకర్యార్థం గత ఏడాది నుంచి చిత్తూరు జిల్లా రేణిగుంట వరకు రైలు సేవలను విస్తరించారు. నంద్యాల నుంచి ప్రతి రోజు ఉదయం 6.30 గంటలకు రైలు బయలుదేరుతుండటంతో నంద్యాల, బనగానపల్లె, కోవెలకుంట్ల, సంజామల, వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, కడప, ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట తదితర ప్రాంతాల ప్రజలకు రైలు ప్రయాణం సులభతరంగా మారింది. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు అనువైన సమయం కావడంతో రైలు ద్వారానే రాకపోకలు సాగిస్తున్నారు. ఉదయం వెళ్లేందుకు సాయంత్రం తిరిగి ఇళ్లకు చేరుకునేలా రైలు నడుస్తుండటంతో ప్రతి రోజు డెమో రైలు ప్రయాణికులతో కిక్కిరిసి పోతోంది. నంద్యాల మొదలుకుని చిత్తూరు జిల్లా రేణిగుంట వరకు రైలు బోగీలు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. విద్యార్థులు, ఉద్యోగులతోపాటు ఆయా జిల్లాల్లోని వివిధ ముఖ్య పట్టణాలకు బస్సు ప్రయాణం కంటే రైలు ప్రయాణం దగ్గరి మార్గం కావడంతో ఆయా పట్టణాల్లో బంగారు ఆభరణాలు, వస్త్ర వ్యాపారాల నిమిత్తం ప్రజలు, వ్యాపారాలు రైలు ప్రయాణం సాగిస్తున్నారు. ప్రతి రోజు బోగీల్లో సీట్లు నిండిపోయి నిలబడి ప్రయాణాలు సాగిస్తున్నారు. డెమో రైలుకు కనీసం రెండు బోగీలు అదనంగా ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
మరికొన్ని రైళ్లు నడపాలని ప్రతిపాదన
కేంద్ర మాజీ హోం సహాయ మంత్రి, బిహార్, కర్ణాటక రాష్ట్రాల గవర్నర్‌గా పనిచేసిన సంజామల వాసి దివంగత పెండేకంటి వెంకటసుబ్బయ్య కలల సాకారమైన నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వే మార్గంలో రైళ్ల రాకపోకలు క్రమంగా పెరుగుతున్నాయి. రాకపోకలు ప్రారంభమైన మొదట్లో నంద్యాల నుంచి కడప వరకు వారంలో ఆరు రోజులు డెమో రైలు నడిచేది. తర్వాత ఆరు నెలలకు ధర్మవరం నుంచి రాష్ట్ర రాజధాని అమరావతికి వారంలో మూడు రోజుల మాత్రమే ఎక్స్‌ప్రెస్ రైలు తిరిగేది. 2018 నుంచి డెమో రైలును వైఎస్సార్ జిల్లా పెండ్లిమర్రి వరకు పొడిగించడంతోపాటు ఎక్స్‌ప్రెస్ రైలుతో సహా రెండు రైళ్లు ప్రతి రోజు నడిచేలా రైల్వే అధికారులు చర్యలు తీసుకున్నారు. వీటితో పాటు రెండేళ్ల నుంచి తిరుపతికి ఎక్స్‌ప్రెస్ రైలు నడుస్తోంది. అలాగే ఉత్తర భారదేశానికి రైలు కనెక్టివిటిని విస్తరించేందుకు 2020వ సంవత్సరం నుంచి ఈ మార్గంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైలు నడపాలని ప్రతిపాదన ఉండేది. ఆ ఏడాది కరోనా వైరస్ విజృంభించడంతో ఆ ప్రాతిపాదనను రైల్వే అధికారులు రద్దు చేశారు. తిరిగి ఈ ప్రతిపాదనపై రైల్వే శాఖ దృష్టి సారించింది. రాబోయే రోజుల్లో ఈ రైలు పట్టాలెక్కితే నంద్యాల, ఉమ్మడి వైఎస్సార్ జిల్లాల ప్రజలకు రైలు ప్రయాణం మరింత చేరువకానుంది. ఈ రైలుతోపాటు నంద్యాల–ఎర్రగుంట్ల మార్గంలో మరిన్ని రైళ్లను నడిపేందుకు కేంద్ర రైల్వేశాఖ కసరత్తు చేస్తుండటంతో ఆయా జిల్లాల ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తిరుపతి రైలుకు తగ్గని రద్దీ
నంద్యాల–ఎర్రగుంట్ల మార్గంలో 2022 ఆగస్టు 18 నుంచి గుంటూరు నుంచి తిరుపతికి ఎక్స్‌ప్రెస్ రైలు నడుస్తోంది. గుంటూరు, నరసరావుపేట, వినుకొండ, మార్కాపురం, గిద్దలూరు, నంద్యాల, బనగానపల్లె, ప్రొద్దుటూరు, కడప, రాజంపేట, రేణిగుంట రైల్వేస్టేషన్లలో మాత్రమే ఎక్స్‌ప్రెస్ రైలు ఆగేది. రెండు జిల్లాల ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాల అభ్యర్థన మేరకు నంద్యాల జిల్లా కోవెలకుంట్ల, వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు రైల్వేస్టేషన్లలో స్టాపింగ్ ఏర్పాటు చేశారు. తిరుపతి వెంకన్నస్వామి దర్శనానికి రైలు ప్రయాణం దగ్గరి మార్గం కావడంతో అదనంగా జనరల్ బోగీలు ఏర్పాటు చేయాలని ఆయా జిల్లాల ప్రయాణికులు రైల్వేశాఖ అధికారులను కోరుతున్నారు
రైలు ప్రయాణానికే
ప్రయాణికుల మొగ్గు
నంద్యాల–ఎర్రగుంట్ల రైల్వే మార్గంలో
తగ్గని రద్దీ
ప్రతి రోజు డెమో హౌస్‌ఫుల్
బోగీలు పెంచాలని బలపడుతున్న
డిమాండ్
రైలు ప్రయాణం రయ్..రయ్
రైలు ప్రయాణం రయ్..రయ్
Comments
Please login to add a commentAdd a comment