భార్య డబ్బులివ్వలేదని భర్త బలవన్మరణం
నందికొట్కూరు: మద్యం తాగేందుకు భార్య డబ్బులివ్వలేదని బైరెడ్డి నగర్‌కు చెందిన బోయ నాగన్న(37) ఇంట్లో ఉరేసుకుని బలవనర్మరణానికి పాల్పడ్డాడు. రామచంద్ర తెలిపిన వివరాలు.. నాగన్న కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈక్రమంలో ఆదివారం మద్యం తాగేందుకు డబ్బు ఇవ్వాలని భార్య వరలక్ష్మిని కోరగా లేవని చెప్పి ఆమె బయటకు వెళ్లింది. తిరిగి వచ్చేలోపే ఉరికి వేళాడుతూ కనిపించాడు. కుటుంబ సభ్యులు కిందకు దించి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ తెలిపారు.
ఆటో చోరీ
డోన్ టౌన్: పట్టణంలోని తారకరామనగర్‌కు చెందిన తిక్కయ్య తన ఆటోను ఇంటి బయట పార్కు చేసి ఉంచగా గుర్తు తెలియని వ్యక్తులు శనివారం రాత్రి అపహరించుకెళ్లారు. ఆదివారం ఉదయం బాధితుడు నిద్ర లేచి చూడగా ఇంటి బయట ఆటో కన్పించక పోవడంతో చుట్టుపక్కల గాలించాడు. ఎలాంటి సమాచారం లభించకపోవడంతో చోరీకి గురైనట్లు నిర్ధారించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తిక్కయ్య తెలిపారు.
వ్యక్తి ఆత్మహత్య
కొలిమిగుండ్ల: మండల పరిధిలోని ఎస్.చెన్నంపల్లెలో బోయ అంజి(39) ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. సీఐ రమేష్‌బాబు తెలిపిన వివరాలు.. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న అంజి కుటుంబ పోషణ భారం కావడంతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య మధుసుప్రియ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
190 కోళ్లు మృతి
గడివేముల: మండల కేంద్రంలోని పలు చికెన్ దుకాణల్లో ఆదివారం కోళ్లు మృతి చెందాయి. నాలుగు చికెన్ సెంటర్లు ఉండగా రెండు రోజుల క్రితం ఓ చికెన్ సెంటర్‌లో 120 కోళ్లు, మరో చికెన్ సెంటర్‌లో 70 కోళ్ల దాకా మృతి చెందడంతో ఆ సెంటర్లను మూసివేశారు. బర్డ్‌ఫ్లూ భయంతో చికెన్ తినేవారి సంఖ్య తగ్గడంతో మిగతా దుకాణాలు కూడా బోసిపోయాయి.
దళితులను
విడగొట్టేందుకు కుట్ర
కర్నూలు(అర్బన్): దేశంలో ఓటు బ్యాంకు రాజకీయాలు, దళితులను విడగొట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయని మాల మహానాడు వ్యవస్థాపకులు, స్వర్గీయ పీవీ రావు సోదరుడు, మాజీ ఐడీఏఎస్ అధికారి పీఎస్‌ఎన్ మూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం స్థానిక ఓ హోటల్‌లో మాల జేఏసీ ముఖ్య నేతలతో ఆయన సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతేడాది ఆగస్టు 1న ఎస్సీ ఉప వర్గీకరణకు సంబంధించి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు రాజ్యాంగబద్ధత లేదన్నారు. దేశంలోని ఏపీ, తెలంగాణ, పంజాబ్, హర్యాణ, తమిళనాడు రాష్ట్రాలు మినహా మిగిలిన 24 రాష్ట్రాలు ఈ తీర్పును వ్యతిరేకిస్తున్నాయన్నారు. సుప్రీం తీర్పు అనంతరం ప్రాంతీయ సమస్యగా ఉన్న ఈ అంశం ప్రస్తుతం జాతీయ సమస్యగా మారిందన్నారు. ఈ తీర్పు వల్ల దేశ వ్యాప్తంగా 30 లక్షల మంది దళితులు రోడ్డు పైకి వచ్చారన్నారు. ఒక కులాన్ని జాబితాలో చేర్చాలన్నా, తొలగించాలన్నా కేవలం పార్లమెంట్‌కు మాత్రమే అధికారం ఉందన్నారు. వర్గీకరణకు వ్యతిరేకంగా ఈనెల 23న కర్నూలులో, మార్చి 23న తిరుపతిలో రాయలసీమ మాలల యుద్ధ గర్జన సభలు నిర్వహిస్తున్నారన్నారు. మాలలు పెద్ద ఎత్తున తరలివచ్చి సభలను విజయవంతం చేయాలని కోరారు. అనంతరం యుద్ధ గర్జన కరపత్రాలను విడుదల చేశారు. సమావేశంలో మాల జేఏసీ నేతలు గోన నాగరాజు, మాధవస్వామి, పి.రాజీవ్‌కుమార్, నరసప్ప తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment