పేకాట.. కాసుల వేట!
జూద గృహాల వైపు
కన్నెత్తి చూడని పోలీసులు
ఆదోని పట్టణంలో గత రెండు నెలలుగా ఎక్కడ చూసినా పేకాట స్థావరాల చర్చ జరుగుతోంది. కూటమి నేతనే ఈ స్థావరాలను నడుపుతున్నట్లు పోలీసులకు తెలిసినా అటువైపు ఎందుకు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు ఉన్నాయి. సంబంధిత కూటమి నేత ఓ పోలీసు అధికారితో నెల మామూళ్లు ఇచ్చేలా డీల్ చేసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో జూద స్థావరాలపై ఎవరూ దాడులు చేయడం లేదు.
ఆదోని అర్బన్: ‘రండి బాబూ రండి.. ఆటాడుకోండి.. మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి’ అంటూ పేకాటరాయుళ్లకు కూటమి నేత ఆఫర్ ప్రకటిస్తున్నాడు. అధికారం మాదే.. అడ్డుకునేదెవరంటూ దర్జాగా పట్టణ నడిబొడ్డున జూద స్థావరాలు నిర్వహిస్తూ రూ. లక్షలు ఆర్జిస్తున్నాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదోని పట్టణంలో మూడు పార్టీల నేతలు అక్రమార్జనపై దృష్టి సారించారు. ఇప్పటికే కొందరు నాయకులు డీలర్‌షిప్‌లు, ఫీల్డ్ అసిస్టెంట్‌లు తదితర కాంట్రాక్ట్ పోస్టులు ఇప్పిస్తామని రూ. లక్షలు వసూలు చేయగా, ఇందులో ఒక నేత అందరి కంటే ఒక అడుగు ముందుకేశాడు. పట్టణంలో పేకాట స్థావరాలను నిర్వహిస్తూ నా రూటే సపరేటు అంటున్నాడు. పట్టణంలోని ఓ పోలీస్‌స్టేషన్ పరిధిలో నాలుగుచోట్ల ప్రాంతాలు మార్చి గ్యాంబ్లింగ్ (అందర్‌బహర్) ఆడిస్తున్నట్లు తెలిసింది. రోజుకు రూ. లక్షలు చేతులు మారుతున్నాయి. ఉదయం పూట ఆట ఆడిస్తే రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో అందరికీ తెలుస్తుందని మధ్యాహ్నం 3 గంటలకు ఒక షో ప్రారంభించి సాయంత్రం 5 నుంచి 6 గంటల్లో ముగిస్తారు. రెండో షో రాత్రి 8 నుంచి 9 గంటలకు మొదలెట్టి 11 గంటలలోపు ముగిస్తున్నారు. ఆట ఆడాలంటే ముందుగా ఎంట్రెన్స్ రుసుం రూ.2 వేలు కట్టాల్సిందే. ఒక షోకు ఇలా 15 నుంచి 20 మంది వరకు ఆటగాళ్లు వస్తున్నారు. ఇలా రోజుకు రెండు షోలు కలపి మొత్తం రూ. 80 వేల వరకు కూటమి నేత జూద నిర్వహణలో సొమ్ము చేసుకుంటున్నాడు. రూ. వేలు తీసుకుని పేకాటరాయుళ్లకు కేవలం ‘గ్లాసు’ నీళ్లు, పేకాట కార్డులు సమకూర్చుతున్నట్లు తెలుస్తోంది. ఓ లాడ్జిలో నిర్వహించే స్థావరం పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే ఉంది. మరో ప్రాంతం బైపాస్ రహదారి వద్ద, ఇంకోటి కూటమి నేత స్వగృహం వద్ద, మరొకటి నిర్మాణంలో ఉన్న భవనంలో ఆడిస్తున్నారు.
అక్కడికక్కడే అధిక వడ్డీకి అప్పులు..
పేకాట స్థావరాల వద్ద డబ్బులు పోగొట్టుకున్న వారికి మళ్లీ అదృష్టాన్ని పరీక్షించుకోండి అంటూ అక్కడే వడ్డీ వ్యాపారులు డబ్బులు చేతపట్టుకుని ఆశ పెడతారు. అప్పటికప్పుడు రూ. 30 వేల నుంచి రూ. 50 వేల వరకు అప్పులిచ్చే వ్యక్తులే అక్కడే ఉంటున్నారు. వీరి వద్ద కొందరు ఇప్పటికే రూ. లక్షల్లో అప్పు చేసినట్లు తెలుస్తోంది. అధిక వడ్డీలకు అప్పులు తీసుకున్న పేకాట రాయుళ్లు తిరిగి చెల్లించేందుకు ఆస్తులు తాకట్టు పెడుతు న్నారు. ఈ జూద కూపంలో మునిగిన వారిలో కొందరు బంగారు నగలు, ఇళ్ల స్థలాలు అమ్ముకు న్నట్లు తెలుస్తోంది.
దర్జాగా కూటమి నేత
జూదం నిర్వహణ
అనుమానం రాకుండా
స్థావరాల మార్పు
ఎంట్రీ ఫీజు రూ. 2 వేలు
‘గ్లాసు’ మంచినీళ్లు, కార్డులు
మాత్రమే ఉచితం
అప్పులు ఇచ్చేందుకు వడ్డీ
వ్యాపారులు అక్కడే తిష్ట
జూద కూపంలో మునిగి
సర్వం కోల్పోతున్న వ్యసనపరులు
Comments
Please login to add a commentAdd a comment