పోక్సో కేసుపై విచారణ
పాణ్యం: మండల పరిధిలోని ఆలమూరు ప్రాథమికోన్నత పాఠశాల హెచ్‌ఎం బి.మల్లేశ్వర్‌పై నమోదైన పోక్సో కేసుపై నంద్యాల ఎస్డీపీఓ జావళి విచారణ చేపట్టారు. బాధిత విద్యార్థినులను, వారి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తానని ఆమె తెలిపారు. కాగా హెచ్‌ఎంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ఎస్సీ, ఎస్పీ మానిటరింగ్ సెల్ సభ్యుడు పి.దానం డిమాండ్ చేశారు. ఎస్డీపీఓ వెంట ఎంఈఓ సుబ్రహ్మణ్యం ఉన్నారు.
పొలాల్లోకి దూసుకెళ్లిన కారు
ఆలూరు రూరల్: కారు అదుపు తప్పి పొలాల్లో దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. మండలంలోని మొలగవల్లి రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం ఉదయం ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే.. మొలగవల్లి గ్రామానికి చెందిన శివరామి రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం కోసిగి గ్రామానికి బయలు దేరారు. మొలగవల్లి రైల్వే స్టేషన్ సమీపంలో కుక్క అడ్డురావడంతో కారు ఆదుపుతప్పి పొలాల్లో దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో శివరామి రెడ్డి, నర్సిరెడ్డి, లక్ష్మీదేవి, సంజీవ రెడ్డి, మహిపాల్ రెడ్డికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం గుంతకల్లు ఆసుపత్రికి తరలించారు.
వివాహిత ఆత్మహత్య
హొళగుంద: మండలంలోని పెద్దహ్యాట గ్రామానికి చెందిన చలవాది యశోద (32) అనే వివాహిత ఆదివారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడింది. ఈమె గత కొన్నేళ్లుగా కడుపునొప్పితో బాధ పడుతుంది. ఆదివారం నొప్పి మరింత తీవ్రం కావడంతో భరించ లేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి ఇనుప గరాండకు చీరతో ఉరి వేసుకున్నట్లు హెడ్ కానిస్టేబుల్ లక్ష్మిరాం నాయక్ సోమవారం విలేకరులకు తెలిపారు. మృతురాలికి కుమారుడు, కూతురు సంతానం. మృతురాలి తండ్రి తిప్పేస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
అగ్నిప్రమాదంలో పొట్టేళ్ల సజీవ దహనం
ఆత్మకూరు: పట్టణంలోని కిషన్‌సింగ్ వీధిలో సోమవారం వేకువజామున జరిగిన అగ్నిప్రమాదంలో పది పొట్టేళ్లు సజీవ దహనమయ్యాయి. ఖాదర్‌వలికి చెందిన రేకుల షెడ్డులో మంటలు గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. రేకుల షెడ్డులో ఉన్న పది పొట్టేళ్లు మృతిచెందాయి. సీసీ కెమెరాలు, ఇంటి సామగ్రి సర్వం కాలి బూడిదైంది. ప్రమాదంలో రూ.3 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు వాపోయాడు. కాగా ప్రమాదం ఎలా జరిగిందనేది తెలియాల్సి ఉంది.
ఆర్‌ఎంపీపై కేసు నమోదు
బండి ఆత్మకూరు: మండల పరిధిలోని కడమల కాలువ గ్రామంలో ఆర్‌ఎంపీ సుబ్బరాయుడిపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ జగన్‌మోహన్ సోమవారం తెలిపారు. ఆర్‌ఎంపీ సుబ్బరాయుడు కడమల కాలువ గ్రామంలో ఓ మహిళను కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు సుబ్బరాయుడిపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు.
మద్యం బాటిళ్ల స్వాధీనం
శ్రీశైలం: దేవస్థానం టోల్‌గేట్ వద్ద సోమవారం నిర్వహించిన వాహనాల తనిఖీలో మద్య బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ప్రసాద్‌రావు తెలిపారు. ఎస్టీ కాలనీకి చెందిన ముదావత్ తిరుపతి నాయక్, మూడవత్‌లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 30 కేరళ మాల్టెడ్ ఫైన్ విస్కీ బాటిళ్లతోపాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తనిఖీల్లో వన్ టౌన్ పోలీసులు రాజేంద్ర కుమార్, రఘునాథుడు, మహేష్, వెంకటనారాయణ, నాను నాయక్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment