నేటి సాయంత్రంలోగా పీ4 సర్వే పూర్తి చేయాలి
కర్నూలు(అర్బన్): జిల్లాలో చేపట్టిన పీ4 (పబ్లిక్, ప్రైవేటు, పీపుల్స్, పార్టనర్‌షిప్ ) సర్వేను ఈ నెల 4 సాయంత్రంలోగా పూర్తి చేయాలని జిల్లా పరిషత్ సీఈఓ జి.నాసరరెడ్డి కోరారు. ఆయన సోమవారం జెడ్పీలోని తన చాంబర్ నుంచి జిల్లాలోని ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లతో గూగుల్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇచ్చిన లక్ష్యాల మేరకు ఆధార్ వెరిఫికేషన్‌ను తప్పకుండా పూర్తి చేయాలన్నారు. గ్రామ సచివాలయాలను జనాభా ఆధారంగా రెండు, మూడు సచివాలయాలను కలిపి క్లస్టర్ చేసేందుకు ప్రభుత్వ ఆదేశాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. సర్వేలను త్వరితగతిన పూర్తి చేసి రాష్ట్రంలోనే కర్నూలు జిల్లాను ముందు వరుసలో నిలపాలన్నారు. గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బంది రోజు వారీ హాజరును తప్పక వేయాలని, లేనిపక్షంలో షోకాజ్ నోటీసులు జారీ చేయాలన్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ షెడ్లను త్వరగా పూర్తి చేసి, వర్మీ తయారీపై దృష్టి సారించాలన్నారు.
వెబ్‌సైట్‌లో ఫిర్యాదుల పరిష్కార ప్రొఫార్మాలు
కర్నూలు(హాస్పిటల్): అభ్యర్థుల ఫిర్యాదుల పరిష్కార ప్రొఫార్మాలను కర్నూలు, నంద్యాల జిల్లాల వెబ్‌సైట్లు https:// kurnool.ap.gov.in, https://nandyal.ap. gov.in, కర్నూలు మెడికల్ కాలేజీ వెబ్‌సైట్ https:// kurnoolmedicalcollege.ac.inలలో అప్‌లోడ్ చేసినట్లు కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీ, జనరల్ హాస్పిటల్, గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీలకు సంబంధించిన ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు 2023 నవంబర్ 21న జారీ చేసిన నోటిఫికేషన్‌కు సంబంధించి 11 కేటగిరిల అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు.
సీనియారిటీ జాబితాలపై అభ్యంతరాల స్వీకరణ
కర్నూలు సిటీ: ఉపాధ్యాయుల సాధారణ సీనియారిటీ జాబితాలు డీఈఓ వెబ్‌సైట్‌లో ఉన్నాయని, అభ్యంతరాలు ఉంటే తగిన ఆధారాలతో తెలపాలని డీఈఓ ఎస్.శ్యామూల్ పాల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆధారంగా తయారు చేసిన జాబితాను వైబ్‌సైట్‌తో పాటు నోటీసు బోర్డులో కూడా అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. జెడ్పీ, మండల, మునిసిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని స్కూళ్లలో పని చేస్తున్న ఉపాధ్యాయులు అభ్యంతరాలు ఈనెల 10వ తేదీలోపు డీఈఓ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో అందజేయాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లోని టీచర్లకు అభ్యంతరాలు ఉంటే ఆర్జేడీ కడప కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు.
కేసీకి నీటి విడుదల బంద్
కర్నూలు సిటీ: సుంకేసుల బ్యారేజీ నుంచి కర్నూలు–కడప కెనాల్‌కు నీటి విడుదల పూర్తి స్థాయిలో నిలిచిపోయింది. అలాగే ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి సైతం నీటి విడుదల నిలిపివేశారు. మల్యాల నుంచి 675 క్యుసెక్కుల నీరు మాత్రమే కేసీకి పంపింగ్ చేస్తున్నారు. ఈ కాలువ పరిధిలో రబీలో సుమారుగా 90,200 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. మొన్నటి వరకు ఆయకట్టుకు నీరు అందించామని, ప్రస్తుతం పంటలకు నీరు అవసరం లేదని ఇంజినీరింగ్ వర్గాలు చెబుతున్నాయి. నంద్యాల, ఆళ్లగడ్డ సబ్ డివిజన్ ప్రాంతంలోని సాగులో ఉన్న ఆయకట్టుకు వచ్చే నెల వరకు నీరిస్తేనే పంటలు చేతికొచ్చే అవకాశం ఉంది. వైఎస్సార్ జిల్లా రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment