లింగ నిర్ధారణపై ప్రకటనలు ఇస్తే చర్యలు
కర్నూలు(హాస్పిటల్): లింగ నిర్ధారణకు సంబంధించి ఎలాంటి ప్రకటనలు జారీ చేసినా చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌వో డాక్టర్ పి. శాంతికళ గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. జిల్లా పరిధిలోని ప్రైవేటు ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు లింగనిర్ధారణపై వాణిజ్య ప్రకటనలు ఇవ్వకూడదన్నారు. లింగనిర్ధారణ పరీక్షలను ప్రోత్సహించేలా గోడపత్రికలు అంటించినా, హోర్డింగ్‌లు పెట్టినా, వాణిజ్య ప్రకటనలు చేసినా పీసీ అండ్ పీఎన్‌డీటీ చట్టం ప్రకారం నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని, నిబంధనలను అతిక్రమిస్తే మూడు నుంచి ఐదేళ్లు జైలు శిక్ష, రూ.50వేల నుంచి రూ.ఒక లక్ష వరకు జరిమానా విధిస్తామన్నారు.
యువకుడి దుర్మరణం
నందవరం: మండల పరిధిలోని జొహరాపురం గ్రామం వద్ద గురువారం బైక్‌ను బొలెరో వాహనం ఢీకొనడంతో ఓ యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఎస్‌ఐ శ్రీనివాసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. జొహరాపురం గ్రామానికి చెందిన కేసీ ఓసూరప్ప, సోమేశ్వరమ్మ దంపతుల రెండో కుమారుడు చక్రవర్తి(23) ఉదయం ఎరువుల కోసమని బైక్‌పై నాగలదిన్నెకు బయలుదేరాడు. సి.బెళగల్ మండలం పోలకల్ గ్రామానికి చెందిన బొలెరో వాహనం కందుల లోడ్‌తో కర్ణాటక రాష్ట్రం రాయచూరు మార్కెట్‌కు బయలుదేరింది. జొహరాపురం గ్రామ సమీపంలోని ప్రధాన రహదారిలో బొలెరో వాహనం అతివేగంగా బైక్‌ను ఢీకొంది. ప్రమాదంలో చక్రవర్తి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పోలీసులు ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చేతికి అందివచ్చిన కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు.
పంట కాలువలో రైతు మృతదేహం లభ్యం
సి.బెళగల్: మండల కేంద్రంలోని తెలుగు వీధిలో నివసముండే రైతు తెలుగు రోగెన్న (52) మృతదేహం గురువారం పంట కాలువలో లభ్యమైంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. ఈనెల 3న రాత్రి రాత్రి భోజనం అనంతరం కల్లంలో ఉన్న ఎండుమిర్చి దిగుబడుల వద్దకు కాలప నిమిత్తం వెళ్లాడు. మరుసటి రోజు ఉదయం ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తెలిసిన చోటల్లా గాలించారు. ఈక్రమంలో గురువారం ఉదయం పొలాలకు వెళ్తున్న రైతులకు కాలువలో రోగెన్న మృతదేహం కలినిపించడంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకుని బోరున విలపించారు. కాగా ఎండుమిర్చి దిగుబడుల వద్దకె కాలువపై కాలినడకన వెళ్తూ ప్రమాదశాత్తూ అందులో జారి పడి మృతి చెంది ఉంటాడని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. మృతుడికి భార్య సావిత్రమ్మ, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.
బీసీ మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ
కర్నూలు(అర్బన్): వెనుకబడిన తరగతుల ఆర్థిక సహకార సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని బీసీ, ఈబీసీ, కమ్మ, రెడ్డి, క్షత్రియ, వైశ్య, కాపు (బలిజ) కులాల మహిళలకు టైలరింగ్‌లో ఉచితంగా శిక్షణ ఇచ్చి శిక్షణ అనంతరం కుట్టు మిషన్లు అందించనున్నట్లు బీసీ కార్పొరేషన్ ఈడీ ఎస్ జాకీర్‌హుసేన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా కులాలకు చెందిన 18 నుంచి 50 ఏళ్లలోపు వయస్సు ఉన్న మహిళలు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థులు తమకు సమీపంలోని సచివాలయాల ద్వారా httpr://apobmms.apcfss.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు ఆధార్, రేషన్ కార్డు, మొబైల్ ఫోన్ నంబర్ కలిగి ఉండాలన్నారు. మరింత సమాచారం కోసం 9908132030 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment