సంక్షేమానికి ‘కూటమి’ ఎగనామం
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి
కర్నూలు(టౌన్): ‘సూపర్‌సిక్స్’ పేరిట మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ఎగనామం పెట్టిందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి విమర్శించారు. ‘సూపర్‌సిక్స్’ హామీల అమలుపై క్యాలెండర్ విడుదల చేసే దమ్ముందా అని ప్రశ్నించారు. కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్‌లోని తన చాంబర్‌లో శుక్రవారం విలేకరులతో ఎస్వీ మోహన్ రెడ్డి మాట్లాడారు. బడ్జెట్ ప్రసంగం అంతా అంకెల గారడీ తప్ప ఏమీ లేదన్నారు. ఉచిత ఆర్టీసీ బస్సు విషయంలోనూ చంద్రబాబు సర్కార్ మొండిచెయ్యి చూపిందన్నారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలంటే బడ్జెట్‌లో రూ.79 వేల కోట్లు కేటాయించాల్సి ఉందని, అయితే మొదటి బడ్జెట్‌లో రూ.7,282 కోట్లు, ఈ ఏడాది రూ.16,200 కోట్లు కేటాయించిందన్నారు. అసెంబ్లీలో గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించడం చంద్రబాబు సర్కార్‌కే దక్కుతుందన్నారు. ఇంగ్లిషులో 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని గవర్నర్ బడ్జెట్ ప్రసంగంలో చదివితే తెలుగులో మాత్రం ఉద్యోగాల కల్పన చేస్తున్నట్లు ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని విమర్శించే అర్హత కూటమి ప్రభుత్వానికి లేదన్నారు.
మూడు ఆత్మలు ఘోషిస్తున్నాయి
రాష్ట్రంలో టీడీపీ పాలనతో మూడు ఆత్మలు ఘోషిస్తున్నాయని, ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ తెలుసుకోవాలని ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. వెన్నుపోటుకు బలైన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్, హరికృష్ణ, నారా రామ్మూర్తి నాయుడుల ఆత్మలు ఘోషిస్తున్నాయన్నారు. ప్రశ్నించే వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను వేధించడం, భయభ్రాంతులకు గురిచేయడం నిజం కాదా అని ప్రశ్నించారు. గ్రామాల్లో తిరిగే కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలను మహిళలు, రైతులు చొక్కా పట్టుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment