
‘యువత పోరు బాట’ను విజయవంతం చేద్దాం
బనగానపల్లె రూరల్: వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఈనెల 12వ తేదీన జిల్లా కేంద్రం నంద్యాల పట్టణంలో నిర్వహించే ‘యువత పోరు బాట’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు గుండం నాగేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం బనగానపల్లెలోని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు గడిచినా ఇంత వరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. ఏటా డీఎస్సీ నోటిఫికేషన్, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి హామీలు చేయకపోవడంతో యువత మోసపోయిందన్నారు. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం అమలు చేస్తామని చెప్పి మహిళలను దగా చేశారన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల కాక ఎంతో మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యారని విమర్శించారు. 2014–19 ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చెల్లించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద సుమారు రూ.3,200 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ ఈనెల 12న చేపట్టే యువత పోరు బాట కార్యక్రమానికి జిల్లాలోని పార్టీ నేతలు, కార్యకర్తలు, యువత, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. అదే రోజు ముందుగా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి స్వగృహంలో నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ ప్రచార కార్యదర్శి సిద్దంరెడ్డి రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ యువజన విభాగం బనగానపల్లె, కోవెలకుంట్ల సంజామల, మండలాల అధ్యక్షులు తూర్పింటి శ్రీనివాసరెడ్డి, అంబటి రవికుమార్‌రెడ్డి, రాంభూపాల్‌రెడ్డి, తోట వెంకటేశ్వరరెడ్డి, కోవెలకుంట్ల వాణిజ్య విభాగం అధ్యక్షులు నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వైఎస్సార్‌సీపీ యువజన విభాగం అధ్యక్షుడు నాగేశ్వరరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment