జిల్లా స్థాయి చెస్ పోటీలు ప్రారంభం
నంద్యాల(న్యూటౌన్): పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో 17 సంవత్సరాల్లోపు బాలబాలికలకు జిల్లా స్థాయి చెస్ పోటీలు ప్రారంభమయ్యాయి. నంద్యాల జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. రామకృష్ణ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సుబ్బయ్య, లయన్స్‌క్లబ్ అధ్యక్షుడు నిజాముద్దీన్ పోటీలు ప్రారంభించి మాట్లాడారు. చెస్ క్రీడ ఏకాగ్రతను పెంచుతుందని, తద్వారా చదువులో కూడా రాణించడానికి వీలవుతుందన్నారు. పిల్లల చేతికి మొబైల్ ఫోన్‌లు ఇవ్వకుండా వారి దృష్టిని ఆటలపై మళ్లించాలన్నారు. జిల్లా స్థాయిలో ఎంపికై న క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో జిల్లా చెస్ సంఘం అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ, కార్యదర్శి రామసుబ్బారెడ్డి, రామకృష్ణ డిగ్రీ కళాశాల డైరెక్టర్ ప్రగతిరెడ్డి పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
ఓర్వకల్లు: కర్నూలు–కడప జాతీయ రహదారిపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గడివేముల మండలం ఒండుట్ల గ్రామానికి చెందిన తలారి రంగస్వామి కొడుకు రంగనాయకులు (50) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తాడు. ఈ క్రమంలో పొగాకు దిగుబడులను విక్రయించేందుకు మండలంలోని నన్నూరు సమీపాన గల డెక్కన్ కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చారు. పంట నాణ్యత సరిగాలేదని కొనుగోలు దారులు పొగాకు బేళ్లను రీబేల్ చేయడంతో స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు ట్రాక్టర్‌లో వేసుకొని తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యంలో రెడ్డి డాబా వద్ద ట్రాక్టర్ నిలబెట్టి డాబా వైపునకు వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా నంద్యాల నంచి కర్నూలు వైపు వెళుతున్న లారీ రంగనాయకులును ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. విషయం తెలుసుకున్న స్థానికులు హైవే పెట్రోలింగ్ వాహనంలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుడి భార్య ఐదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా, ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment