ఏపీఎస్పీ రెండవ పటాలంలో బదిలీలకు గ్రీన్‌సిగ్నల్
మేనేజర్, స్టోర్ ఎన్‌సీఓ పోస్టులకు
భారీ పోటీ
ప్రతి కంపెనీలో ఒక మేనేజర్, స్టోర్ ఎన్‌సీఓ ఉంటాడు. ఆయా పోస్టులను దక్కించుకునేందుకు సిబ్బంది పోటీ పడుతున్నారు. నిబంధనల ప్రకారం ఆయా పోస్టుల్లో విధులు నిర్వహించాలంటే అందుకు సంబంధించిన శిక్షణ తప్పనిసరి. గతంలో ఇదే విధులు నిర్వహించిన వారికి మళ్లీ నియమించకూడదనే నిబంధన కూడా ఉంది. అయితే కొందరు రెండోసారి కూడా ఆయా పోస్టుల్లో పనిచేశారు.
కర్నూలు: ఏపీఎస్పీ కర్నూలు రెండో పటాలంలో సిబ్బంది బదిలీలకు రంగం సిద్ధమైంది. నూతన కమాండెంట్ బాధ్యతలు చేపట్టిన దీపిక పాటిల్ ఆదేశాల మేరకు బదిలీల జాబితా సిద్ధమైనట్లు సిబ్బందిలో చర్చ జరుగుతోంది. గత నెల 25న కమాండెంట్ సంబంధిత కంపెనీ ఆర్‌ఐలకు(ఆఫీసర్ కమాండింగ్) బదిలీలకు సంబంధించిన మెమో (ఉత్తర్వులు) ఇచ్చా రు. బెటాలియన్‌లో తొమ్మిది కంపెనీలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం ఏళ్ల తరబడి బయటి కంపెనీల్లో పనిచేసిన వారిని హెడ్ క్వార్టర్‌కు బదిలీ చేయాల్సి ఉంది. మొత్తం పటాలంలో దాదాపు 1100 మంది సిబ్బంది ఉన్నారు. టర్న్ ప్రకారం ప్రతి ఒక్కరికీ హెడ్ క్వార్టర్‌లో విధులు నిర్వహించేలా అవకాశం కల్పించాలి. ఇందుకు అనుగుణంగా కమాండెంట్ చర్యలు చేపట్టడంతో ఫెవికాల్ వీరులు పైరవీలు ముమ్మరం చేసినట్లు చర్చ జరుగుతోంది. ఒకటి రెండు రోజుల్లో బదిలీల జాబితా వెలువడే అవకాశం ఉన్నట్లు తెలు స్తోంది. ఈ నేపథ్యంలో కొంతమంది ఆఫీసర్ కమాండెంట్లు చేతివాటం ప్రదర్శించి బదిలీల జాబితా తయారీలో అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని, జాబితాను సమగ్రంగా పరిశీలించి ఏళ్ల తరబడి బయటి కంపెనీలో పనిచేస్తున్న వారికి కమాండెంట్ న్యాయం చేస్తారనే ఆశాభావం సిబ్బందిలో వ్యక్తమవుతోంది.
వీరు ఫెవికాల్ వీరులు
● స్టోర్ ఎన్‌సీఓగా ఎమ్‌టీ గ్రూప్‌లో హెడ్ కానిస్టేబుల్ రంగసామిరెడ్డి 15 ఏళ్లుగా కొనసాగుతున్నారు. దీపిక పాటిల్ కమాండెంట్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సిబ్బంది సమస్యలపై దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా రంగసామిరెడ్డిపై పలువురు సిబ్బంది ఫిర్యాదు చేశారు. దీంతో అతడి స్థానంలో బాల హుసేన్ (హెచ్‌సీ 817)ను నియమించారు. అవమానంగా భావించిన రంగసామిరెడ్డి ద్వితీయ శ్రేణి అధికారి సహాయంతో సిక్ లీవ్‌లో వెళ్లారు. ఇందుకు ఓ అధికారికి పి–క్యాప్ స్టిక్ కానుకగా బహుకరించినట్లు సిబ్బందిలో చర్చ జరుగుతోంది. ఈయన ఏఎంటీఓ ద్వారా హెడ్ క్వార్టర్‌లోనే కొనసాగేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
● సమరసింహారెడ్డి (కళ్యాణ మండపం నిర్వహణ) 20 ఏళ్లుగా హెడ్ క్వార్టర్‌లోనే కొనసాగుతున్నారు.
● తిరుమల్‌రెడ్డి 30 ఏళ్లుగా ట్రైనింగ్ గ్రూప్‌లోనూ, బందె నవాజ్ 20 ఏళ్లుగా బెటాలియన్ హాస్పిటల్‌లో, హెడ్ కానిస్టేబుల్ మౌలాలి పదేళ్లుగా హాస్పిటల్ విధులు, టైలరింగ్ గ్రూప్‌లో 15 ఏళ్లుగా జిలానీ బాషాతో పాటు మరో పది మంది దాకా వివిధ గ్రూపుల్లో హెడ్ క్వార్టర్‌లో విధులు నిర్వహిస్తుండటం వల్ల బయటి కంపెనీల్లో పనిచేసేవారికి అవకాశం దక్కడం లేదని సిబ్బంది వాపోతున్నారు.
● అసిస్టెంట్ కమాండెంట్ల దగ్గర విధులు నిర్వహించే పీఏలు కూడా ఏళ్ల తరబడి హెడ్ క్వార్టర్‌లోనే కొనసాగుతున్నట్లు సిబ్బందిలో చర్చ జరుగుతోంది.
● కానిస్టేబుల్ కిరణ్ 20 ఏళ్లుగా అసిస్టెంట్ కమాండెంట్ దగ్గర పనిచేస్తున్నారు.
● విశ్వనాథ్ రెడ్డి ట్రెజరీలో ఎనిమిదేళ్లుగా హెడ్ క్వార్టర్‌లోనే ఉంటున్నారు.
● డీఎస్పీలు ఎస్‌ఎం బాషా దగ్గర హుసేనయ్య, రమణ దగ్గర రియాజ్, రవికిరణ్ దగ్గర రాజు కొన్నేళ్లుగా సీట్లకు అతుక్కుని విధులు నిర్వహిస్తున్నారు.
● హెడ్ కానిస్టేబుల్ విశ్వనాథ్ రెడ్డి కూడా అసిస్టెంట్ కమాండెంట్, గతంలో కమాండెంట్ దగ్గర విధులు నిర్వహిస్తున్నారు. కానిస్టేబుల్‌గా విధుల్లో చేరినప్పటి నుంచి హెడ్ క్వార్టర్‌లోనే కొనసాగుతుండటంతో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
బదిలీలకు రూ.లక్షల్లో వసూలు
నచ్చిన చోటుకు పంపేందుకు, ఉన్న చోటనే కొనసాగించేందుకు ఉద్యోగుల నుంచి గతంలో మామూళ్లు వసూలు చేశారని ఫిర్యాదుల నేపథ్యంలో పదవీ విరమణ పొందిన ఓ ఉన్నతాధికారిపై విచారణ జరిగింది. పదవీ విరమణకు ఒక రోజు ముందు బదిలీల పేరుతో ఇద్దరు అధికారులు చక్రం తిప్పి ముడుపులు వసూలు చేశారు. వివిధ హోదాల్లో ఉన్న వంద మందికి స్థానచలనం కల్పించి గత కమాండెంట్ రూ.లక్షల్లో దండుకున్నారు. ఈ తరహా బదిలీలపై సిబ్బంది నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో డీఐజీ రాజకుమారి ఆదేశాల మేరకు 16వ బెటాలియన్ కమాండెంట్ శ్రీనివాస్ గతంలో విచారణ జరిపి ఆ శాఖ ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. అయితే చర్య ప్రశ్నార్థకంగా మారినట్లు తెలుస్తోంది.
మార్గదర్శకాలతో మెమో జారీ చేసిన
కమాండెంట్
అర్హుల జాబితాను సిద్ధం చేసిన
కంపెనీ ఆర్‌ఐలు
Comments
Please login to add a commentAdd a comment