చాగలమర్రిలో దంపతులపై దాడి
చాగలమర్రి: మండల కేంద్రమైన చాగలమర్రిలోని మంగలి వీధిలో షేక్ బీబీ, మహబూబ్‌బాషా దంపతులపై అదే కాలనీకి చెందిన వారు దాడి చేశారు. సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకున్న ఈ ఘటనలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే..మహబూబ్‌బాషా ఇంటి ఎదురుగా తాజు, తాహెర్ అనే వ్యక్తులు నివసిస్తారు. ఇళ్ల ముందు వాహనాలు నిలిపే విషయంలో ఇరుకుటుంబాల మధ్య గొడవ ఉంది. ఈ క్రమంలో సోమవారం తాజు, తాహెర్ మరికొంత మంది మహబూబ్‌బాషా దంపతుల ఇంటిపైకి వెళ్లి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బీబీతో పాటు భర్తను స్థానిక ఓ ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రులపై దాడి విషయం తెలుసుకున్న కుమార్తె అబీదా, బంధువు ఇనాయతుల్లా పరామర్శించేందుకు ప్రొద్దుటూరు నుంచి ఆసుపత్రికి వచ్చారు. నిందితులు మరో పదిమందితో కలిసి అక్కడికి చేరుకొని వారిపై కూడా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఆళ్లగడ్డ రూరల్ సీఐ మురళీధర్‌రెడ్డి తెలిపారు. ఇదిలా ఉంటే తీవ్రంగా గాయపడిన షేక్ బీబీని వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం ప్రొద్దుటూరుకు తరలించినట్లు కుటుంబీకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment