సాధారణ కాన్పులో బాలభీముడు జననం
కోడుమూరు రూరల్: స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ఓ మహిళకు సాధారణ కాన్పులో 4.25 కిలోల బరువు గల పండంటి మగ శిశువు మంగళవారం రాత్రి జన్మించాడు. కోడుమూరు మండలం వర్కూరు గ్రామానికి చెందిన సులోచన ప్రసవ నొప్పులతో మంగళవారం స్థానిక ప్రభుత్వాసుపత్రికి వచ్చారు. ఆరోగ్య పరీక్షలు చేసిన గైనకాలజిస్ట్ పుష్పలత సాధారణ కాన్పు చేశారు. సహజంగా అప్పుడే పుట్టిన పిల్లలు రెండున్నర కిలోల నుంచి మూడున్నర కిలోల బరువు ఉంటారని ఈ బిడ్డ 4.25 కిలోలు ఉండటం అది కూడా సాధారణ కాన్పులో జన్మించడం విశేషమని వైద్యాధికారి డా.నాగరాజు తెలిపారు. సులోచనకు ఇది నాలుగో కాన్పు. అన్ని కూడా నార్మల్ డెలివరీలు కావడం గమనార్హం. ముగ్గురు అమ్మాయిల తర్వాత కుమారుడు జన్మించడం పట్ల సులోచన, నారాయణ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు.