జీవనశైలితో కిడ్నీ కుదేల్!
● పెరుగుతున్న కిడ్నీ వ్యాధి బాధితులు ● 10 నుంచి 17 శాతానికి పెరిగిన రోగుల సంఖ్య ● బీపీ, షుగర్‌తోనే కిడ్నీకి ఇబ్బంది ● కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి నెలా 1300 మందికి డయాలసిస్ ● 30 ఏళ్ల లోపు బీపీ వస్తే కిడ్నీ సమస్యలు ఉన్నట్లు అనుమానం ● నేడు వరల్డ్ కిడ్నీ డే
మానవశరీరంలో గుప్పెడంత పరిమాణంలో ఉండే కిడ్నీలు రక్తాన్ని వడపోసి, మలిన పదార్థాలను వేరుచేసి వాటిని మూత్రం ద్వారా విసర్జిస్తాయి. దేహంలో నీటి శాతాన్ని అవసరమైన పరిమాణంలో క్రమబద్ధంగా ఉంచి ఎక్కువైన నీటిని బయటకు పంపిస్తాయి. లవణ పరిమాణాన్ని, రక్తపోటును క్రమబద్ధీకరిస్తాయి. ఇలా మనిషి ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకపాత్ర పోషించే ఈ అవయవం పనితీరు మందగించి అది విఫలమవ్వడం ఆరంభమైతే దానిని పూర్తిగా నయం చేయడం కష్టం. అయితే, ప్రస్తుతం మారిన మనిషి జీవన శైలి ఆ పరిస్థితిని తీసుకొస్తుంది. అవగాహన లేమితో కిడ్నీ సంబంధ వ్యాధులు పెరిగిపోతున్నాయి. ఈ నెల 13న వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా ప్రత్యేకం కథనం.
ఆరేళ్లలో కిడ్నీ రోగుల వివరాలు
కర్నూలు(హాస్పిటల్): నిరంతరం పనిచేసే కిడ్నీలను జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా తీవ్ర నష్ట జరుగుతుంది. కొన్నిసార్లు ప్రాణాల మీదకు వస్తుంది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని నెఫ్రాలజి విభాగంలో ప్రతి వారం సోమ నుంచి శుక్రవారం వరకు ఓపీ చూస్తారు. ఇక్కడ గత జనవరి నెల 665 ఓపీ, 138 ఐపీ, ఫిబ్రవరిలో 450 ఓపీ, 137 ఐపీ రోగులు చేరి చికిత్స పొందారు. ఈ విభాగంలో సగటున ప్రతి నెలా 1300 మంది దాకా కిడ్నీ బాధితులకు డయాలసిస్ చేస్తున్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు నలుగురికి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించి విజయవంతం చేశారు. ఈ ఆసుపత్రితో పాటు నగరంలోని పలు నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ(వైద్యసేవ) ద్వారా ఉచితంగా డయాలసిస్, పలు రకాల ఆపరేషన్లు ఉచితంగా నిర్వహిస్తున్నారు.
పిల్లలు, పెద్దల్లో కిడ్నీ వ్యాధులు
చిన్నపిల్లల్లో పుట్టుకతో వచ్చే జన్యుపరమైన వ్యాధులు, ఇన్‌ఫెక్షన్ వల్ల మూత్రపిండాల వ్యాధులు కలుగుతాయి. పుట్టుకతో వచ్చే జన్యుపరమైన వ్యాధుల వల్ల పిల్లలు ఎదుగుదల లేకపోవడం, మూత్రం ఎక్కువగా, తక్కువగా పోవడం, కాళ్లు, చేతులు వంకర్లు పోవడం వంటివి జరుగుతాయి. ఇన్‌ఫెక్షన్‌తో వచ్చే వ్యాధుల వల్ల పిల్లలకు మూత్రం ఎరుపు రంగులో రావడం, కాళ్లవాపులు రావడం, ఒళ్లు దద్దుర్లు రావడం వంటివి జరుగుతాయి. పెద్దల్లో రక్తపోటు, మధుమేహం, మూత్రపిండాల ఇన్‌ఫెక్షన్ వల్ల సాధారణంగా మూత్రపిండాలు చెడిపోతాయి. ఈ వ్యాధులు ఉన్న వాళ్లు మూత్రపిండాల వైద్యుల పర్యవేక్షణలో ఉండటం మంచిది.
కిడ్నీలు పాడయ్యేందుకు కారణాలు
బీపీ, షుగర్, ఉబ్బు కామెర్లు, అధిక మొత్తంలో నొప్పుల మాత్రలు వాడటం, కిడ్నీల్లో రాళ్లు, జన్యుపరంగా పుట్టుకతో వచ్చే వ్యాధులు, మూత్రకోశ, మూత్రనాళ వ్యాధులు, వాంతులు, విరేచనాలు, పాముకాటు, మలేరియా, పచ్చకామెర్లు, లెప్టోస్పైరా, గర్భం సమయంలో మూత్రం ఇన్‌ఫెక్షన్, రక్తపోటు రావడం వల్ల కిడ్నీలు దెబ్బతింటాయి.
సంవత్సరం ఓపీ ఐపీ
రోగుల సంఖ్య రోగుల సంఖ్య
2019 9,034 1,830
2020 2,640 630
2021 1,546 1,010
2022 5,228 1,337
2023 5,575 1,493
2024 6,943 1,771
కిడ్నీ జబ్బు లక్షణాలు
నిస్సత్తువ, వాంతి వచ్చినట్లు ఉండటం, ఆకలి లేకపోవడం, దురద, ఒళ్లునొప్పులు, మూత్రం ఎక్కువగా పోవడం, అతి తక్కువగా పోవడం, రాత్రిపూట మూత్రం ఎక్కువగా పోవడం, శరీర వాపు, చిన్నపిల్లల్లో మూత్రం ఎర్రగా రావడం, ఒళ్లు దద్దుర్లు, చిన్నపిల్లల్లో ఎదుగుదల లేకపోవడం, కాళ్లు వంకరలు పోవడం, అధిక రక్తపోటు.
వ్యాధి లక్షణాలను బట్టి చికిత్స
మూత్రపిండాలకు వచ్చిన వ్యాధి లక్షణాలు, దాని తీవ్రతను బట్టి వైద్యులు రకరకాల చికిత్సలను చేయాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని వ్యాధులు ఆహార నియమావళి పాటించి మందులు తీసుకుని తగ్గించుకోవచ్చు. కొన్ని వ్యాధుల్లో డయాలసిస్, కిడ్నీ మార్పిడి అవసరం రావచ్చు.
–డాక్టర్ ఎం. శ్రీధరశర్మ, అసిస్టెంట్ ప్రొఫెసర్, నెఫ్రాలజి విభాగం, జీజీహెచ్, కర్నూలు
జీవనశైలితో కిడ్నీ కుదేల్!
జీవనశైలితో కిడ్నీ కుదేల్!
Comments
Please login to add a commentAdd a comment