ఉల్లి రైతు కంట కన్నీరు!
మార్కెట్‌లో వ్యాపారుల ఇష్టారాజ్యం
● కొన్ని లాట్లకు ధర కోట్ చేయని వైనం ● నాణ్యత సాకుగా చూపి అన్యాయం ● విధిలేక ఎంతోకొంతకు అమ్ముకుంటున్న రైతులు
మార్కెట్‌లో రైతులకు తీరని అన్యాయం
ఎకరాకు రూ.30 వేల వరకు ఖర్చు పెట్టి ఉల్లి సాగు చేశాం. 60 ప్యాకెట్ల దిగుబడి వచ్చింది. ఎంతో వ్యయ ప్రయాసలతో కర్నూలు మార్కెట్‌కు తీసుకొచ్చి మంగళవారం టెండరుకు పెట్టాం. ఉల్లి నాణ్యత సంతృప్తికరంగానేనే ఉంది. కానీ వ్యాపారులు టెండరు వేయలేదు. అలాగని సరుకును వెనక్కు తీసుకుపోలేం. మార్కెట్‌లో రైతులకు తీరని అన్యాయం జరుగుతోంది. ఏదో ఒక ధరకు అమ్ముకుపోయే పరిస్థితి కల్పిస్తున్నారు.
– సుంకులమ్మ, చిట్యాల గ్రామం,
క్రిష్ణగిరి మండలం
మూడు రోజులైనా కొనే దిక్కులేదు
ఈ నెల 9న రాత్రి 100 ప్యాకెట్ల ఉల్లిని కర్నూలు మార్కెట్‌కు తీసుకొచ్చాం. నాణ్య త కూడా బాగుంది. సోమవారం టెండరు కు పెట్టారు. వ్యాపారులెవ్వరూ టెండరు వేయలేదు. మంగళవారం కూడా టెండరుకు పెట్టారు. అయినా వ్యాపారులు స్పందించలేదు. మార్కెట్‌కు ఉల్లి గడ్డలు తీసుకరావడానికి దాదాపు రూ.7వేల నుంచి రూ.8వేలు ఖర్చయింది. వెనక్కి తీసుకపోవాలంటే మళ్లీ అదే స్థాయిలో ఖర్చు వస్తుంది. టెండరు వేయకపోతే అనామతుపై అతి తక్కువ ధరకు విక్రయించుకోవాల్సిందే.
– దేవేంద్ర ఆచారి, గువ్వలదొడ్డి గ్రామం,
ఎమ్మిగనూరు మండలం
కర్నూలు(అగ్రికల్చర్): పంట దిగుబడులను గిట్టుబాటు ధరతో అమ్ముకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి రైతులు వ్యయ ప్రయాసలకోర్చి కర్నూ లు మార్కెట్‌కు చేరుకుంటున్నారు. సరుకు మార్కెట్‌లోకి ప్రవేశించే సమయంలోనే లాట్ నెంబర్ అలాట్ అవుతుంది. పంట నాణ్యతను బట్టి వ్యాపారులు ఈ–నామ్‌లో ఆన్‌లైన్ టెండరు ద్వారా ఏదో ఒక ధర కోట్ చేయాల్సి ఉంది. ఎక్కువ ధర కోట్ చేసిన వారికి ఆ లాట్ దక్కుతుంది. రైతు ఆ ధరకు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. మరుసటి రోజు మళ్లీ టెండరుకు పెట్టుకోవచ్చు. కానీ మార్కెట్‌లో కొన్ని లాట్‌లకు వ్యాపారులు అస్సలు టెండరు వేయరు. ప్రధానంగా ఉల్లిగడ్డల విషయంలో ప్రతి రోజు 20 నుంచి 30 లాట్లకు వ్యాపారులు టెండరు వేయని పరిస్థితి. ఈ కారణంగా రైతులు రోజుల తరబడి మార్కెట్‌లోనే ఉండాల్సి వస్తోంది. వ్యాపారులు సిండికేట్‌గా మారి కొన్ని లాట్లకు ధర కోట్ చేయరనే ప్రచారం జరుగుతోంది. టెండరు వేయకపోతే రైతు లు ఏదో ఒక ధరకు అమ్ముకుంటారని, అప్పుడు నాణ్యత బాగోలేదని చెబితే తక్కువ ధరతో లాట్‌ను దక్కించుకోవచ్చనే కుట్ర కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతి రోజు 20 నుంచి 30 మంది రైతులు అనామతుపై నామమాత్రపు ధరకు అమ్ముకొని కన్నీళ్లతో ఇంటిముఖం పడుతుండటం గమనార్హం.
ఉల్లి రైతు కంట కన్నీరు!
ఉల్లి రైతు కంట కన్నీరు!
Comments
Please login to add a commentAdd a comment