24 గంటల్లో భవన నిర్మాణాలకు అనుమతులు
● టౌన్ ప్లానింగ్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ విజయభాస్కర్
కర్నూలు (టౌన్): పట్టణాల్లో భవనాల అనుమతులకు సంబంధించి 24 గంటల వ్యవధిలో అనుమతులు మంజూరు చేస్తున్నట్లు టౌన్ ప్లానింగ్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ విజయభాస్కర్ అన్నారు. బుధవారం స్థానిక నగర పాలక సంస్థ నూతన కౌన్సిల్ హాలులో జిల్లాలోని మున్సిపాల్టీల పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు, లైసెన్సు ఇంజినీర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా డిప్యూటీ డైరెక్టర్ మాట్లాడుతూ భవన నిర్మాణాలకు అనుమతుల్లో జాప్యాన్ని నిరోధిస్తూ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. దీని ప్రకారం దరఖాస్తును పోర్టల్‌లో అప్‌లోడ్ చేసిన గంటల వ్యవధిలోనే అనుమతులు పొంది పనులు ప్రారంభించవచ్చన్నారు. అక్యుపెన్సీ సర్టిఫికెట్ సైతం పొందవచ్చని చెప్పారు. అయితే, నిర్మాణానికి సర్వే రిపోర్టు, స్థలం విలువ ఆధారిత సర్టిఫికెట్ తప్పనిసరిగా పొందుపరచాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఆకస్మిక తనిఖీల్లో అనుమతులను రద్దు చేస్తామన్నారు. టెక్నికల్ పర్సన్లు తప్పులు చేస్తే వారి లైసెన్సులు రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిటీ ప్లానర్ ప్రదీప్‌కుమార్, డిప్యూటీ సిటీ ప్లానర్ శోభన్ బాబు, డీటీసీపీ శశిలత, నంద్యాల అసిస్టెంట్ సిటీ ప్లానర్ మూర్తి, టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది, వార్డు ప్లానింగ్ రెగ్యులేషన్ అధికారులు ఎల్‌టీపీలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment