క్రీడలపై కూటమి నేతల దుష్ప్రచారం సిగ్గుచేటు
నందికొట్కూరు: ఆడుదాం ఆంధ్ర క్రీడల్లో ఒకరేమో రూ.300 కోట్ల స్కామ్ అంటారు, మరొకరేమో రూ.400 కోట్ల స్కామ్ అని నోటికొచ్చినట్లు మాట్లాడటం చూస్తే వాళ్ల ఆరోపణల్లో నిజం లేదనే విషయం తెలుస్తోందని రాష్ట్ర శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అన్నారు. బుధవారం ఆయన నంద్యాల జిల్లా నందికొట్కూరులో విలేకరులు అడిగిన ప్రశ్నలకు పైవిధంగా సమాధానమిచ్చారు. తెలుగు దేశం పార్టీ ప్రజాప్రతినిధులు, కూటమి నేతలు నోటికి వచ్చినట్లు ఆడుదాం ఆంధ్ర క్రీడల్లో స్కామ్ జరిగినట్లు దుష్ప్రచారం చేయడం సిగ్గు చేటన్నారు. క్రీడల శాఖ మంత్రి ఆడుదాం ఆంధ్రకు బడ్జెట్‌లో రూ.119 కోట్లు కేటాయించినట్లు అసెంబ్లీలో చెబుతుంటే ఆరోపణలు చేసేవారికి వినిపించకపోవడం శోచనీయమన్నారు. ఎన్నికల ముందు రాష్ట్రమంతా చంద్రబాబు, భువనేశ్వరి కన్నీటితో ప్రచారం చేసి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి పది నెలలైనా మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడం లేదన్నారు. నాలుగేళ్ల వరకూ జగనన్న పాలనపై ఇదే విమర్శలు చేసుకుంటూ ఒక్కపథకం కూడా అమలు చేయకుండా కాలం గడపటమే చంద్రబాబు నైజమన్నారు. రైతు భరోసా, తల్లికి వందనం ఇవ్వాలని ప్రజలు అడుగుతుంటే ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమంగా కేసులు బనాయించడం తగదని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 15వేల సచివాలయాలకు రూ.38 కోట్లతో క్రీడా కిట్లను పంపిణీ చేశామని గుర్తు చేశారు. గత జగనన్న పాలనలో సచివాలయాలలో 1.30 లక్షల ఉద్యోగాలు ఇస్తే కూటమి నేతలకు కనిపించకపోవడం విడ్డూరమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment