బీసీ రుణాలపై ‘పచ్చ’ గద్దలు | - | Sakshi
Sakshi News home page

బీసీ రుణాలపై ‘పచ్చ’ గద్దలు

Published Fri, Mar 14 2025 1:29 AM | Last Updated on Fri, Mar 14 2025 1:29 AM

బీసీ

బీసీ రుణాలపై ‘పచ్చ’ గద్దలు

‘‘ ఎంపీడీఓ గారు ... బీసీ కార్పొరేషన్‌ రుణాలకు సంబంధించి నేను ఒక లిస్ట్‌ పంపుతున్నాను. మిగిలిన వాటన్నింటిని పక్కన పెట్టి ఈ లిస్ట్‌లో ఉన్న వాళ్లకి బీసీ కార్పొరేషన్‌ లోన్లు వచ్చేలా చూడు ! అవసరమైతే బ్యాంకర్లతో కూడా మాట్లాడు.. ఎలాగైనా మనవాళ్లకు రుణాలు అందే తీరాలి’’ అంటూ ఎంపీడీఓలను జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు ఆదేశిస్తున్నారు.

తాము పంపిన జాబితాలనే

ఓకే చేయాలని హుకుం

ఎంపీడీఓలను ఆదేశిస్తున్న ఎమ్మెల్యేలు

టీడీపీ నేతల సిఫారసుతో

అర్హులకు మొండిచెయ్యి

జనరిక్‌ షాపులకు భలే డిమాండ్‌

జనాభాలో సింహభాగం ఉన్నా

4,201 యూనిట్లే!

కర్నూలు (అర్బన్‌): బీసీ కార్పొరేషన్‌ రుణాలను తన్నుకుపోయేందుకు ‘పచ్చ’ నేతలు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తాము సిఫారసు చేసిన వారిని కాదని, ఏ ఒక్కరికీ రుణం మంజూరైనా పరిస్థితులు వేరుగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రభుత్వం అందజేయనున్న సబ్సిడీ రుణాలపై టీడీపీ నేతల కన్ను పడింది. తమ వారికే అందించాలని అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. పేదలకు పారదర్శకంగా సబ్సిడీ రుణాలు అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో వేలాది మంది నిరుద్యోగులు ఈ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ... ఆయా మండల కేంద్రాలు, మున్సిపల్‌ కార్యాలయాల్లో జరిగిన ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఇంతలో అందరి ఎంపీడీఓలకు ఎమ్మెల్యే కార్యాలయాల నుంచి లబ్ధిదారుల ఎంపిక జాబితాలను తామే పంపిస్తామని, మీరు ఎలాంటి ఎంపిక జాబితా తయారు చేయవద్దని ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. దీంతో రాజకీయ సిఫారసు లేకుంటే అర్హత ఉన్నా, రుణం అందని పరిస్థితి నెలకొనింది. సిఫారసు ముందు పారదర్శకత అనే పదం మంటగలిసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అధినేత బాటలోనే తమ్ముళ్ల ప్రయాణం

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు బాటలోనే టీడీపీ నాయకులు కూడా ప్రయాణిస్తున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రే వైఎస్సార్‌సీపీకి చెందిన వారికి ఏ పనులు చేయకండని చెప్పడంతో దాన్ని స్థానిక ఎమ్మెల్యేలు ‘ తుచ ’తప్పకుండా పాటిస్తున్నారు. రుణాల విషయంలో కూటమిలోనూ అధిక శాతం పోటీ నెలకొనడంతో జనసేన, బీజేపీ నేతలను పక్కనపెట్టి లబ్ధిదారుల ఎంపికలో టీడీపీ విధేయులకే పెద్దపీట వేస్తున్నట్లు తెలుస్తోంది. బీసీ, ఈబీసీ, కాపు రుణాల్లో మితిమీరిన రాజకీయ జోక్యం చోటు చేసుకోవడంతో అర్హులకు రుణాలు అందని పరిస్థితి నెలకొనింది.

జనరిక్‌ షాపులకు భలే డిమాండ్‌

జనరిక్‌ మందుల షాపుల ఏర్పాటుకు సంబంధించి 50 శాతం సబ్సిడీ ఉండడంతో చోటా నేతల దృష్టి అంతా ఈ రుణాలపై పడింది. తమ ప్రాంతంలో బీఫార్మసీ, ఎంఫార్మసీ పూర్తి చేసిన వారి చిరునామాలను గుర్తించి ఎలాగైనా మీకు రుణాలు ఇప్పిస్తామని నమ్మబలుకుతూ కమీషన్లు గుంజుతున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో 62 జనరిక్‌ మెడికల్‌ షాపులను మంజూరు చేసింది. ఒక్కో షాపు ఏర్పాటుకు రూ.8 లక్షలు అవసరం కాగా, ఇందులో 50 శాతం అంటే రూ.4 లక్షలను సబ్సిడీ ఉన్న నేపథ్యంలో టీడీపీ నేతల చూపు వీటిపై పడింది. అలాగే అన్ని పథకాల ఏర్పాటుకు గరిష్టంగా రూ.2 లక్షలు సబ్సిడీ ఉన్నందున రుణాలను ఎలాగైనా తమ వారికి ఇప్పించుకునేందుకు తాపత్రయ పడుతున్నారు.

జనాభాలో సింహభాగం ఉన్నా ...

ఉమ్మడి కర్నూలు జిల్లాలో సింహభాగం జనాభా బీసీ, ఈబీసీలు ఉన్నా, కేవలం 4201 యూనిట్లను మాత్రమే మంజూరు చేశారనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లాలో బీసీ కార్పొరేషన్‌ ద్వారా రూ.77.19 కోట్ల రుణాలను అందించనున్నారు. ఇందులో కర్నూలు జిల్లాకు 1,673 మంది బీసీలకు, 171 మంది ఈబీసీలకు రూ.31.35 కోట్లు, నంద్యాల జిల్లాలో 2,156 మంది బీసీలు, 171 మంది ఈబీసీలకు రూ.45.84 కోట్లను అందించనున్నారు. అలాగే కాపు కార్పొరేషన్‌ ద్వారా కర్నూలు జిల్లాలో 190 యూనిట్లకు రూ.6.40 కోట్లు, నంద్యాల జిల్లాలో రూ.6.35 కోట్లతో 189 యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

స్వేచ్ఛ కోల్పోయిన అధికారులు

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ‘నవరత్నాల ’ పేరుతో కులం, మతం, రాజకీయం చూడకుండా అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలను అందించిన అధికారులకు ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో స్వేచ్చ లేకుండా పోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, ఎంపీడీఓల పర్యవేక్షణలోనే లబ్దిదారుల ఎంపిక జరిగేది. ఎలాంటి రాజకీయ జోక్యం లేకపోవడం వల్ల అర్హులైన ప్రతి ఒక్కరికి అప్పట్లో సంక్షేమ పథకాలు అందాయని, ప్రస్తుతం తమ చేతులు కట్టేసి పనులు చేయమంటున్నారని పలువురు ఎంపీడీఓలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
బీసీ రుణాలపై ‘పచ్చ’ గద్దలు1
1/1

బీసీ రుణాలపై ‘పచ్చ’ గద్దలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement