
ముగిసిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు
కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సర ప్రధాన పరీక్షలు ముగిశాయి. గురువారం జరిగిన పరీక్షలకు 23,114 మంది విద్యార్థులకుగాను 22,479 మంది హాజరుకాగా.. 635 మంది గైర్హాజరు అయ్యారు. ఇంటర్మీడియెట్ పరీక్షలు చివరి దశకు చేరుకోవడంతో బోర్డు అధికారులు మూల్యాంకనం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 17 నుంచి ప్రధాన సబ్జెక్టుల మూల్యాంకనం మొదలు కానుంది.
రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యం
కర్నూలు: రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యంగా పోలీసులు చర్యలు చేపట్టారని ఎస్పీ విక్రాంత్ పాటిల్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడ రోడ్డు ప్రమాదం జరిగినా వెంటనే డయల్ 100 , 112కు ఫోన్ చేసి సమాచారమివ్వాలని తెలిపారు. రోడ్డు భద్రత నిబంధన ఉల్లంఘనలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారని పేర్కొన్నారు. విజిబుల్ పోలీసింగ్ ద్వారా ప్రజల్లో భద్రతా భావం పెంపొందిస్తున్నామని తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిపై నిరంతరం డ్రోన్ కెమెరాలతో నిఘా కొనసాగుతుందని పేర్కొన్నారు.
సామరస్యంతో హోలీ జరుపుకోవాలి
కర్నూలు: మతసామరస్యం పాటిస్తూ సంతోషకర వాతావరణంలో హోలీ పండుగ జరుపుకోవాలని జిల్లా ప్రజలకు ఎస్పీ విక్రాంత్ పాటిల్ విజ్ఞప్తి చేశారు. జిల్లా ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. పండుగ వేడుకల్లో ఎదుటి వారి మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించొద్దని సూచించారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలన్నారు.
మద్దతు ధరతో శనగల కొనుగోలు
కర్నూలు(సెంట్రల్): మద్దతు ధరతో శనగల కొనుగోలుకు చర్యలు తీసుకుంటున్నట్లు జేసీ డాక్టర్ బి.నవ్య గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. రైతులు సమీపంలోని రైతు సేవా కేంద్రాల్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. క్వింటా శనగకు మద్దతు ధర రూ.5,650గా నిర్ణయించామన్నారు. జిల్లాలో 29వేల మంది రైతులు 1,04,43.25 ఎకరాల్లో శనగ సాగు చేసినట్లు పేర్కొన్నారు.
లా సెమిస్టర్ ఫలితాల విడుదల
కర్నూలు సిటీ: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో లా సెమిస్టర్ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు వర్సిటీ పరీక్షల విభాగం సీఈ వెంకటేశ్వర్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. థర్డ్, ఫిఫ్త్ ఇయర్స్ 2, 4, 6, 8, 10 సెమిస్టర్ల ఫలితాల కోసం https://rayalaseemauniversity.ac.in/ అనే వెబ్‌సైట్‌ను సందర్శించాలని పేర్కొన్నారు.
హంద్రీ–నీవాకు నిలిచిపోయిన నీరు
దేవనకొండ: హంద్రీ– నీవా కాలువకు అధికారులు నీటిని అర్ధాంతరంగా ఆపేశారు. మార్చి 15 వరకు నీటిని వదులుతారని అధికారులు ప్రకటించినా మార్చి 12వ తేదీనే నిలిపివేశారు. దీంతో పంట తుది దశకు చేరుకున్న రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. దేవనకొండ మండలంలో హంద్రీ–నీవా కాలువ కింద రబీలో 8 వేల ఎకరాల్లో వివిధ పంటలను సాగుచేశారు. మొత్తం 3 వేల ఎకరాల్లో పంటలు చివరి దశకు చేరుకోనున్నాయి. ఇంతలోనే కాలువకు నీరు బంద్ కావడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment