రూ.210 కోట్లతో ‘పందికోన’ పనులు
● అధికారులు ప్రతిపాదనలు పంపాలి
● జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు (సెంట్రల్): పందికోన రిజర్వాయర్‌లో మిగిలిపోయిన పనులను పూర్తి చేసేందుకు రూ.210 కోట్లతో ప్రతిపాదనలను త్వరితగతిన ప్రభుత్వానికి పంపించాలని అధికారులను జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆదేశించారు. ఈ నిధులతో పనులు చేపడితే ఆయకట్టు విస్తీర్ణాన్ని పెంచవచ్చని తెలిపారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టుల పరిస్థితిపై జలవనరుల శాఖ అధికారులతో గురువారం జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సుంకేసుల జలాశయం, గాజులదిన్నె ప్రాజెక్టు, పందికోన రిజర్వాయర్, కృష్ణగిరి రిజర్వాయర్, హంద్రీనీవా విస్తరణ పనులు, పులికనుమ రిజర్వాయర్, 68 ట్యాంకులు నింపడం, గుండ్రేవుల రిజర్వాయర్ గురించి కలెక్టర్ జలవనరుల శాఖ అధికారులతో చర్చించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ .. హంద్రీ–నీవా విస్తరణ పనులను జూన్ లోపు పూర్తి చేయాలన్నారు. హంద్రీ–నీవా కాలువ ద్వారా 68 ట్యాంకులను నీరు నింపాల్సి ఉండగా ఇప్పటివరకు 33 చెరువులకు నింపారని, మిగిలిన ట్యాంకులను కూడా త్వరితగతిన నింపాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి సమస్యలు, అవసరమైన నిధుల వివరాలు అందజేయాలని జలవనరుల శాఖ ఏసీని ఆదేశించారు. డబ్బులిస్తేనే తుంగభద్ర దిగువ కాలువ చివరి ఆయకట్టు రైతులకు నీళ్లు ఇస్తామని పత్రికల్లో వచ్చిన వార్తలపై కలెక్టర్ వివరణ అడిగారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, జలవనరుల శాఖ ఎస్‌ఈ ద్వారకానాథ్ రెడ్డి, హంద్రీనీవా ఈఈ చంద్రశేఖర్‌రెడ్డి, ఈఈలు, డీఈలు శైలేష్, రామకృష్ణ, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రూ.210 కోట్లతో ‘పందికోన’ పనులు
Comments
Please login to add a commentAdd a comment