ప్రసవ వేదనతో ఉపాధ్యాయిని మృతి
కోసిగి: మండల కేంద్రంలోని చాకలిగేరి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయిని కవిత(28) ప్రసవ వేదనతో ఆత్మకూరు ఆస్పత్రిలో ఆదివారం రాత్రి మృతి చెందిందారు. సోమవారం ఉదయం ఎంఈఓ శోభరాణి, హెచ్‌ఎం సుబ్బలక్ష్మి తెలిపిన వివరాలు.. పాములపాడు మండలం బానుముక్కల గ్రామానికి చెందిన కవిత 2018 డీఎస్సీలో ఉపాధ్యాయురాలిగా ఎంపికై 2020 సెప్టెంబర్ 27న కోసిగి చాకలిగేరి ప్రాథమిక పాఠశాలలో చేరింది. ఏడాది క్రితం సచివాల ఉద్యోగి వినోద్‌తో వివాహం కాగా మూడు నెలల క్రితం మెటర్నిటీ సెలవుల్లో సొంత గ్రామం బానుముక్కలకు వెళ్లింది. ఆదివారం అర్ధరాత్రి ప్రసవ నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆత్మకూరు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రసవ సమయంలో ఆమె హైబీపీతో ఆస్పత్రిలోనే మృతి చెందారు. విషయం తెలుసుకున్న తోటి ఉపాధ్యాయులు సంతాపం తెలిపారు.
మహిళ ఆత్మహత్యాయత్నం
బండి ఆత్మకూరు: మండల పరిధిలోని కడమల కాలువ గ్రామానికి చెందిన మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మహిళపై కొన్నిరోజుల క్రితం ఆర్‌ఎంపీ సుబ్బరాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఇదే విషయమై గతంలో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తనపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ ఆర్‌ఎంపీతోపాటు అతని తండ్రి సోమవారం తెల్లవారుజామున మహిళ ఇంటి మీదకు వెళ్లి హత్యాయత్నానికి పాల్పడ్డారు. భయాందోళనకు గురైన మహిళ పురుగు మందు తాగింది. కుటుంబ సభ్యులు, స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఈ విషయంపై ఎస్‌ఐ జగన్‌మోహన్‌ను వివరణ కోరగా జరిగిన ఘటనపై విచారణ జరిపి, బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు.
జలవనరుల శాఖలో పదోన్నతులు
కర్నూలు (సిటీ): జలవనరుల శాఖలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న వారికి అడ్‌హక్ విధానంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లుగా పదోన్నతులు కల్పించి పోస్టింగులు ఇస్తూ ఆ శాఖ ప్రత్యేక స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయిప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి జిల్లాకు చెందిన 11 మంది ఇంజినీర్లు పదోన్నతులు పొందారు. ఎస్‌ఆర్‌బీసీ సర్కిల్1లోని సబ్ డివిజన్3లో డీఈఈగా పనిచేస్తున్న సీహెచ్ శ్రీనివాసరావు, ఎన్.నాగేంద్రకుమార్ (తెలుగు గంగ), ఎం.రమేష్ బాబు(ఎస్‌ఆర్‌బీసీ క్వాలిటీ కంట్రోల్), ఎస్.గుణకర్‌రెడ్డి (సీఈ ఆఫీస్, కర్నూలు), ఎం.వేణుగోపాల్ రెడ్డి(ఎస్‌ఆర్‌బీసీ సర్కిల్1), ఎస్.మురళి (జీఆర్‌పీ), ఎం.మల్లికార్జున రెడ్డి(ఎస్‌ఆర్‌బీసీ సర్కిల్1), పి.శరత్‌కుమార్ (తెలుగు గంగ), బి.మహేష్ (సీఈ ఆఫీస్, కర్నూలు), ఎస్.శివప్రసాద్ (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ సర్కిల్1), టి.రాధాకృష్ణ (ఎస్‌ఆర్‌బీసీ సర్కిల్1) పదోన్నతి పొందారు. వీరందరికీ పదోన్నతులు కల్పించి పోస్టింగ్ ఇచ్చారు.
మృతదేహం లభ్యం
పెద్దకడబూరు: మండల పరిధిలోని పులికనుమ ప్రాజెక్టులో గల్లంతైన వ్యక్తి మృతదేహం సోమవారం రాత్రి లభ్యమైంది. మండల పరిధిలోని హులికన్వీ గ్రామానికి చెందిన మస్కి నాగేంద్ర శనివారం రాత్రి చేపలు పట్టడానికి పులికనుమ ప్రాజెక్టులో దిగి గల్లంతైన విషయం విధితమే. ఆదివారం గాలించినా మృతదేహం ఆచూకీ దొరక్క పోవడంతో సోమవారం కూడా గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి మృతదేహం లభ్యమైంది. మృతుడి కుమారుడు చిన్న లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మంజునాథ్, ఎస్‌ఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment