రూ.330 కోట్లకు చేరుతున్న నిరర్ధక ఆస్తులు | - | Sakshi
Sakshi News home page

రూ.330 కోట్లకు చేరుతున్న నిరర్ధక ఆస్తులు

Published Wed, Mar 19 2025 1:20 AM | Last Updated on Wed, Mar 19 2025 1:19 AM

రూ.33

రూ.330 కోట్లకు చేరుతున్న నిరర్ధక ఆస్తులు

రైతుల మెడపై జప్తుల కత్తి

నష్టాల బాటన కేడీసీసీ బ్యాంకు

కూటమి ప్రభుత్వ పాలనలో

మళ్లీ చీకటి రోజులు

ఇప్పటికే 90 మంది రైతుల

ఆస్తులు స్వాధీనం

800 మంది ఆస్తుల వేలానికి

రంగం సిద్ధం

రికవరీ పేరిట రైతుల

ఆత్మాభిమానంతో ఆటలు

వైఎస్సార్‌సీపీ పాలనలో

కేడీసీసీబీ లాభాల బాట

నేడు నిరర్థక ఆస్తులే రూ.330 కోట్లు

వడ్డీ రూ.20 లక్షలు

చిప్పగిరి మండలం ఏరూరు గ్రామానికి చెందిన ఒక రైతు 2021లో కర్షక జ్యోతి కింద రూ.25 లక్షలు, దీర్ఘకాలిక రుణం కింద గొర్రెల పెంపకానికి రూ.15 లక్షల ప్రకారం మొత్తం రూ.40 లక్షల రుణం తీసుకున్నారు. వివిధ కారణాల వల్ల రుణాలను చెల్లించలేదు. నాలుగేళ్లలో వడ్డీ రూ.20 లక్షలు అయింది. మొత్తం రూ.60 లక్షలు చెల్లించాలని, లేకపోతే ఆస్తులు వేలం వేస్తామని నోటీసు జారీ చేశారు. ఇటీవల గ్రామానికి వెళ్లిన ప్రత్యేక టీమ్‌ రైతుకు చెందిన ట్రాక్టరును జప్తు చేసి బెల్డోణలోని పీఏసీఎస్‌కు స్వాధీనం చేశారు.

బైక్‌ను జప్తు చేశారు

చిప్పగిరి మండలం రామదుర్గం గ్రామానికి చెందిన ఒక మహిళ 2014లో దీర్ఘకాలిక రుణం కింద డెయిరీ లోన్‌ తీసుకున్నారు. కంతుల ప్రకారం కొంత మొత్తం కూడా చెల్లించారు. అసలు రూ.2.70 లక్షలు, అయితే ఇప్పుడు ఈ మహిళ చెల్లించాల్సిన మొత్తం వడ్డీతో కలిపి రూ.7 లక్షలు దాటింది. ఇటీవల గ్రామానికి వెళ్లిన రికవరీ టీమ్‌ ఈ మహిళ కుటుంబానికి చెందిన బైకును జప్తు చేసి సొసైటీకి తరలించింది. మహిళ తాకట్టు పెట్టిన స్థిరాస్తులను వేలంలో విక్రయించేందుకు రంగం సిద్ధం చేసింది.

కర్నూలు(అగ్రికల్చర్‌): ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(కేడీసీసీబీ) బకాయిలను రాబట్టుకునేందుకు రైతుల మెడపై జప్తుల కత్తి పెట్టింది. కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు డీసీసీబీ రైతుల జీవితాలతో చెలగాటమాడుతోంది. రైతాంగాన్ని 2024–25లో అధిక వర్షాలు, అనావృష్టి పరిస్థితులు కోలుకోలేని దెబ్బతీశాయి. అంతంతమాత్రం పండిన పంటలకు కూడా గిట్టుబాటు ధరలు లేక నష్టాలను మూటకట్టుకున్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లా సహకార కేంద్రబ్యాంకు రైతుల ఆస్తులు స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచే రైతుల ఆస్తుల వేలానికి చర్యలను వేగవంతం చే యడం గమనార్హం. రుణాల రికవరీకి వెళ్లిన అధికారులు ఏది కనిపిస్తే దానిని స్వాధీనం చేసుకుంటుండటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

90 మంది రైతుల ఆస్తుల స్వాధీనం

కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వత డీసీసీబీ జప్తుల తీవ్రత మొదలైంది. 2014–15 నుంచి 2018–19 వరకున్న టీడీపీ ప్రభుత్వంలో వరుస కరువు రైతులను నిలువునా ముంచింది. పంటలు పండక రైతులు అల్లాడుతుంటే అప్పట్లో కూడా జప్తుల పర్వం కొనసాగింది. నాడు ఆస్తులను వేలం వేయడంతో పాటు రైతుల ఇళ్లలోని చరాస్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు. తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో మళ్లీ నాటి పరిస్థితులే పునరావృతం అవుతున్నాయి. 2024 జూన్‌ 12న కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. నాటి నుంచి నేటి వరకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో 90 మంది రైతుల ఆస్తులను డీసీసీబీతో పాటు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు స్వాధీనం చేసుకున్నాయి. 2024–25లో మొత్తం 800 మంది రైతుల ఆస్తులు వేలం వేయడం, స్వాధీనం చేసుకోవాలనేది లక్ష్యంగా తెలుస్తోంది. ఈ నెల చివరిలోపు రైతుల ఆస్తుల వేలానికి ముమ్మర కసరత్తు జరుగుతోంది. డీసీసీబీలో ప్రధానంగా ఆలూరు బ్రాంచీలో బకాయిలు అత్యధికంగా ఉన్నాయి. మరో రెండు, మూడు రోజుల్లో ఆలూరు ప్రాంతంలోని 18 మంది రైతుల ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి రంగం సిద్ధమైంది.

ముమ్మరంగా చరాస్తుల జప్తు

బకాయిలను రాబట్టుకునేందుకు ముందుగా రైతులకు సంబంధించిన చరాస్తులను జప్తు చేయాలని జాయింట్‌ కలెక్టర్‌, డీసీసీబీ పర్సన్‌ ఇన్‌చార్జి చైర్మన్‌ నవ్య స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. చరాస్తుల జప్తు తర్వాత స్థిరాస్తుల వేలానికి శ్రీకారం చుట్టాలని ఆదేశించారు. జప్తులు, వేలంపాట, రికవరీలపై జేసీ ప్రతి రోజు డీసీసీబీ అధికారులతో టెలి కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షిస్తున్నారు. దీంతో అధికారులు జప్తుల పర్వాన్ని వేగవంతం చేయడం గమనార్హం. ఇప్పటికే ఆలూరు బ్రాంచి పరిధిలోని చిప్పగిరి మండలం ఏరూరు గ్రామంలో ట్రాక్టరు, బైకు.. కుందనగుర్తి గ్రామంలో ఒక బైకు, రామదుర్గం గ్రామంలో రెండు బైకులను జప్తు చేసినట్లు స్పష్టమవుతోంది.

జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నిరర్థక ఆస్తులు కొండలా పెరిగిపోతున్నాయి. 2024 ఏప్రిల్‌ నెలలో రూ.193 కోట్ల నిరర్ధక ఆస్తులు ఉన్నాయి. ఈ నెల 15 నాటికి నిరర్థక ఆస్తులు రూ.267 కోట్లకు చేరుకోగా.. మార్చి చివరి నాటికి రూ.330 కోట్లకు చేరనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆలూరు, డోన్‌, ఆదోని, పత్తికొండ, కృష్ణానగర్‌, కోడుమూరు, కోవెలకుంట్ల, నందికొట్కూరు, వెలుగోడు, ఆత్మకూరు బ్రాంచీల్లో నిరర్థక ఆస్తులు ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
రూ.330 కోట్లకు చేరుతున్న నిరర్ధక ఆస్తులు1
1/1

రూ.330 కోట్లకు చేరుతున్న నిరర్ధక ఆస్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement