కర్నూలు(అగ్రికల్చర్): కొత్త జిల్లాల్లో ట్రెజరీ కార్యాలయాల భవన నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఖజానా, లెక్కల శాఖ డైరెక్టర్ మోహన్‌రావు తెలిపారు. అదేవిధంగా సబ్ ట్రెజరీ కార్యాలయాలకు కూడా సొంత భవనాలు నిర్మిస్తామని, కలెక్టర్లు అవసరమైన స్థలాలు కేటాయించాల్సి ఉందన్నారు. శుక్రవారం ఆయన కర్నూలు జిల్లా ట్రెజరీ, కర్నూలు డివిజన్ సబ్ ట్రెజరీలను తనిఖీ చేశారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో జరిగిన లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలించారు. గత నెల ‘సాక్షి’లో ‘ట్రెజరీల్లో లంచావతారాలు’ శీర్షికన ప్రచురితమైన కథనంపై తీసుకున్న చర్యలపైనా ఆరా తీసినట్లు సమాచారం. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. జిల్లా ట్రెజరీ, సబ్ ట్రెజరీల్లో కొంతమంది ఏళ్ల తరబడి ఒకేచోట పని చేస్తున్నారని, ఇందువల్లనే అక్రమాలకు అవకాశం ఏర్పడిందనే విషయాన్ని విలేకర్లు డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా.. ఇందులో వాస్తవం ఉందని, అయితే ఇందుకు కొన్ని కారణాలు ఉన్నాయన్నారు. మరో నెల, రెండు నెలల్లో బదిలీలకు అవకాశం ఉందని, ఆ సమయంలో ఇలాంటి వారిని బదిలీ చేస్తామన్నారు. ఆయన వెంట జిల్లా ట్రెజరీ అధికారి రామచంద్రరావు, ఏటీవో జయలక్ష్మి, ఎస్‌టీవో పలనాటి సునీల్ తదితరులు ఉన్నారు. మోహన్‌రావును పెన్షనర్ల సంఘాల ప్రతినిధులు కలిశారు.
ఏళ్ల తరబడి ఒకే చోట పనిచేస్తున్న
వారిని త్వరలో బదిలీ చేస్తాం
ఖజానా, లెక్కల శాఖ డైరెక్టర్
మోహన్‌రావు వెల్లడి