
అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి
కర్నూలు: కోడుమూరు మండలం లద్దగిరి హాస్టల్‌లో 9వ తరగతి చదువుతున్న నరేష్ అలియాస్ నాని (15) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. వెల్దుర్తి మండలం నరసాపురం గ్రామానికి చెందిన బజారి, మహదేవి దంపతులకు ఇద్దరు కూతుర్లు, కుమారుడు నరేష్ ఉన్నారు. మహదేవి ఐదేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుంది. అప్పటి ఆమె పిల్లలు కృష్ణగిరి మండలం రామకృష్ణాపురంలో మేనమామ మధు సంరక్షణలో ఉంటున్నారు. కాగా బజారి కర్నూలు వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన లిల్లీని వివాహం చేసుకుని ఇక్కడే ఉంటున్నాడు. నరేష్ లద్దగిరి హాస్టల్‌లో చదువుకుంటూ తరచూ కర్నూలులో ఉన్న తండ్రి దగ్గరకు వచ్చేవాడు. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం హాస్టల్ నుంచి పారిపోయి తండ్రి బజారి వద్దకు వచ్చాడు. గురువారం అనుమానాస్పద స్థితిలో ఇంట్లో చనిపోయాడు. కాగా మొదటి భార్య చనిపోయినప్పుడు పిల్లలకు బజారి 3 ఎకరాల పొలాన్ని రాసిచ్చాడు. అందుకు సంబంధించిన పత్రాలు తీసుకురావాలని కుమారుడు నరేష్‌పై తండ్రి బజారి ఒత్తిడి పెంచి కొట్టి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నట్లు మేనమామ మధు ఫిర్యాదు మేరకు నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.