
ఈ ఎంపీపీ మాకొద్దు
● తిరుగుబాటు జెండా ఎగురవేసిన ఎంపీటీసీలు ● సర్వసభ్య సమావేశానికి గైర్హాజర్ ● భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు
ఎంపీపీ తొగురు సరోజినీ వర్జీనియపై ఎంపీటీసీ సభ్యులు తిరుగుబాటు జెండా ఎగుర వేశారు. ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సర్వసభ్యసమావేశానికి మూకుమ్మడిగా గైర్హాజరయ్యారు. ప్రత్యేకంగా సమావేశమై ఎంపీపీ వ్యవహారం శైలిపై తిరగబడాల్సిందేనని నిర్ణయించుకున్నారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఎంపీపీ తీరును నిరసిస్తూ నిరసన వ్యక్తం చేశారు. – పాములపాడు
మండలంలో 12 మంది ఎంపీటీసీ సభ్యులున్నారు. ఒక్కరు మినహా అందరూ వైఎస్సార్‌సీపీ నుంచే గెలుపొందారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంపీపీ తొగురు సరోజినీ వర్జీనియ, ఎంపీటీసీలు తుమ్మలూరు హాజిరాబీ, వేంపెంట నాగలక్ష్మమ్మ, యర్రగూడూరు దర్గాబాయి టీడీపీలో చేరగా బానుముక్కల ఎంపీటీసీ వెంకటేశ్వర్లు(వైస్ ఎంపీపీ) కాంగ్రెస్ పార్టీలో చేరారు. రుద్రవరం అరుణ స్వతంత్య్ర అభ్యర్థిగా గెలుపొంది టీడీపీలో చేరారు. కాగా పాములపాడు రమాదేవి, మిట్టకందాల మూర్తుజాజీ, మద్దూరు బషీరాహ్మద్, వానాల సరస్వతమ్మ, చెలిమిల్ల సురేష్, జూటూరు–1 వరలక్ష్మి(వైస్ ఎంపీపీ–2), కో ఆప్షన్ సభ్యుడు మూర్తుజావలి వైఎస్సార్‌సీపీలోనే కొనసాగుతున్నారు.
ఎంపీపీ నిరంకుశ వైఖరీ..?
ఎంపీపీ తొగురు సరోజినీ వర్జీనియ తన స్వార్థం కోసం పార్టీ మారిందనే భావన అందరిలోనూ ఉన్నట్లు తెలుస్తోంది. తామంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఎంపీపీ తమ పట్లే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సభ్యుల ఆరోపణ. దీనికి తోడు 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సుమారు రూ.35 లక్షలు నిధులు మంజూరు కాగా ఏ మాత్రం సమాచారమివ్వక పోగా.. ఏయే గ్రామాలకు ఎంతెంత నిధులు కేటాయిస్తున్నారో కూడా సభ్యులకు చెప్పలేదు. ఇక టీడీపీ నాయకులకు, తనకు సన్నిహితంగా ఉంటున్న సర్పంచులకు మాత్రమే నిధులు మంజూరు చేస్తూ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ సభ్యులు ఆరోపిస్తున్నారు.
అవిశ్వాసానికి సిద్ధం?
ఎంపీపీ తీరు మార్చుకోకుండా టీడీపీ నాయకుల చెప్పు చేతుల్లో ఉంటూ వారు చెప్పిన వారికే నిధులు కేటాయిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని ఎంపీటీసీ సభ్యులందరూ సమాలోచనలో పడినట్లు తెలుస్తోంది. వైఎస్సార్‌సీపీకి పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ టీడీపీలో స్వార్థం కోసం చేరిన ఆమెను ఎంపీపీగా ఎందుకు కొనసాగించాలని వారిలో వారు చర్చించుకుంటున్నట్లు సమాచారం. అవిశ్వాస తీర్మానానికి వెళదామని కూడా ఎంపీటీసీ సభ్యులందరూ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా మండలంలో రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయన్నది ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.
సర్వసభ్య సమావేశం వాయిదా
స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం జరగాల్సిన సర్వసభ్య సమావేశానికి ఎంపీటీసీ సభ్యులు గైర్హాజరయ్యారు. అధికారులు, సర్పంచులు మాత్రమే హాజరయ్యారు. మధ్యాహ్నం 12 గంటల వరకు వేచి చూసి కోరం లేనందున సమావేశం బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు ఎంపీడీఓ చంద్రశేఖర్ ప్రకటించారు. కాగా సర్వ సభ్య సమావేశానికి గైర్హాజరైన ఎంపీటీసీ సభ్యులు ఎంపీపీ తొగురు సరోజినీ వర్జీనియాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇప్పటి వరకు మండలానికి నిధులు ఎన్ని మంజూరయ్యాయని, దేనికెంత ఖర్చు చేశారని, తమకెందుకు చెప్పలేదని నిలదీశారు.
ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న ఎంపీటీసీ సభ్యులు