
మార్కెటింగ్ శాఖకు పెరిగిన ఆదాయం
కర్నూలు(అగ్రికల్చర్): 2024–25 సంవత్సరంలో మార్కెటింగ్ శాఖకు ఆదాయం పెరిగింది. వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలపై వ్యాపారుల నుంచి సంబంధిత మార్కెట్ కమిటీలు 1 శాతం ఫీజు వసూలు చేస్తారు. ఆ ప్రకారం రూ.36.18 కోట్ల ఫీజు వసూలు లక్ష్యం కాగా, రూ.39.36 కోట్లు వసూలైంది. కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ మార్కెట్ కమిటీలు లక్ష్యాలను అధిగమించగా.. మంత్రాలయం, కోడుమూరు, ఆలూరు మార్కెట్‌లు వెనుకబడినట్లు మార్కెటింగ్ శాఖ ఏడీ నారాయణమూర్తి తెలిపారు.
విజిబుల్ పోలీసింగ్
మరింత బలోపేతం
కర్నూలు: విజిబుల్ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయాలని క్షేత్రస్థాయి పోలీసు అధికారులను ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా అంతటా పోలీసు అధికారులు గురువారం వాహన తనిఖీలు నిర్వహించారు. అనుమానితులను విచారించి వాహన రికార్డులను పరిశీలించారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వా హనదారులు తప్పనిసరిగా హెల్మెట్, నాలుగు చక్రాల వాహనదారులు సీటు బెల్టు ధరించాలని సూచించారు. సెల్‌ఫోన్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని తనిఖీల సందర్భంగా డ్రైవర్లకు సూచించారు. రహదారి భద్రతా నియమాలు పాటించకపోతే చర్యలు తప్పవని స్టేషన్ల వారీగా హెచ్చరించారు.
5న బాబు జగ్జీవన్‌రామ్ 118వ జయంతి
కర్నూలు(అర్బన్): మాజీ ఉప ప్రధాని దివంగత డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ 118వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ జె.రంగలక్ష్మిదేవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా అధ్యక్షతన స్థానిక ఆర్‌ఎస్ రోడ్డులోని బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహం కూడలిలో జయంతి కార్యాక్రమలను నిర్వహిస్తామన్నారు. ముందుగా జగ్జీవన్‌రామ్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం అక్కడే జయంతి సభను ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమానికి జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, దళిత, ప్రజా సంఘాలకు చెందిన నాయకులు, ప్రజలు, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు హాజరు కావాలని జేడీ కోరారు.
మెరిట్, ఎంపిక జాబితా విడుదల
కర్నూలు(హాస్పిటల్): ఉద్యోగాల భర్తీకి ఫైనల్ మెరిట్ లిస్ట్, సెలక్షన్ లిస్ట్ విడుదల చేసినట్లు కర్నూలు మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్, జనరల్ హాస్పిటల్స్, గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీలకు సంబంధించి ఉద్యోగాల భర్తీకి 2023 నవంబర్ 20న నోటిఫికేషన్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. మొత్తం 11 కేటగిరీల అభ్యర్థుల ఫైనల్ మెరిట్, సెలక్షన్ జాబితాను https:// kurnool. ap. gov. in, https:// nandyal. ap. gov. in, https:// kurnoolmedical. ac. inలల వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశామమని పేర్కొన్నారు. ఎంపికై న అభ్యర్థులు వారి ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు సెట్ల నకలు సర్టిఫికెట్లతో ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు ఉదయం 10.30 గంటలకు కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ కార్యాలయంలో నిర్వహించే కౌన్సెలింగ్‌కు హాజరుకావాలన్నారు. హాజరుకాని అభ్యర్థుల ఎంపిక రద్దు చేస్తామన్నారు.
రైతుసేవా కేంద్రాల్లో
జొన్నల కొనుగోలు
కర్నూలు(సెంట్రల్): రైతుసేవా కేంద్రాల్లో మహేంద్ర రకం జొన్నలు కొనుగోలు చేస్తున్నట్లు జేసీ డాక్టర్ బి.నవ్య గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ–క్రాప్, ఈకేవైసీ చేయించుకున్న రైతులు తమ పేర్లను సచివాలయాల్లో నమోదు చేసుకుంటే క్వింటా జొన్నలు రూ.3,371 ప్రకారం కొనుగోలు చేస్తామన్నారు. నిర్దేశించిన మేరకు నాణ్యత ఉండే జొన్నలనే కొనుగోలు చేస్తామని.. హమాలీ, రవాణా ఖర్చులను పౌరసరఫరాల సంస్థ భరిస్తుందన్నారు.