పొలంలో పేలుడు.. ముగ్గురికి గాయాలు
● ఒకరి పరిస్థితి విషమం
సి.బెళగల్: పొలంలో అడ్డుగా ఉన్న బండరాళ్లను తొలగిస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించి ముగ్గురు యువకులు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సి.బెళగల్‌కు చెందిన పింజరి ఖాజా పొలంలో బండరాళ్లు అడ్డుగా ఉన్నాయి. వీటిని కాంప్రెసర్‌తో పగులగొట్టడానికి గ్రామానికి చెందిన వాహన యజమాని వడ్డె రాజుతో ఒప్పందం చేసుకున్నాడు. గురువారం కాంప్రెసర్ వాహన యజమాని గ్రామానికి చెందిన బలిగేరి కుంటిచేయి లక్ష్మన్న కుమారుడు బలిగేరి వీరాంజనేయులు, సురపురం మునిస్వామి కుమారుడు సురపురం శ్రీరాములు, కేశారం కుమారుడు మద్దిలేటి అనే యువకులతో కలసి పొలానికి వెళ్లారు. పొలంలోని మూడు ప్రాంతాల్లో బండరాళ్లను పేల్చేందుకు ప్రయత్నించగా రెండు మాత్రమే పేలాయి. శుక్రవారం మరోసారి వెళ్లగా మూడో బండరాయి నుంచి ఒక్కసారిగా పేలుడు సంభవించింది. రాళ్లు ఎగిరి పడటంతో పనిలో నిమగ్నమైన ముగ్గురు యువకులు బలిగేరి వీరాంజనేయులు, సురపురం శ్రీరాములు, మద్దిలేటి గాయపడ్డారు. గాయపడిన క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం చేయిస్తున్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బలిగేరి వీరాంజనేయులు పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై విచారిస్తున్నట్లు ఎస్‌ఐ తిమ్మారెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment