ఉల్లాస్.. తుస్..!
ఒక్క రోజూ కూడా
తరగతులు నిర్వహించ లేదు
మాది కానాల గ్రామం. ఇక్కడ ఒక్క రోజు కూడా అభ్యసనా తరగతులు నిర్వహించలేదు. మాకు ఒక్క పాఠ్యపుస్తకం ఇవ్వలేదు. అసలు ఉల్లాస్ కార్యక్రమం గురించే తెలియదు. పరీక్షలు ఎక్కడ పెడతారు? ఏమి రాయాలో తెలియదు. అధికారులెవ్వరూ ఒక్క రోజూ కూడా రాలేదు. మమ్మల్ని ఏమి అడగలేదు.
– కమాల్‌బీ, నిరక్షరాస్యురాలు, కానాల,
నంద్యాల మండలం
తరగతులు నిర్వహించారు
ఉల్లాస్ కార్యక్రమంలో ప్రతి గ్రామంలో వలంటీర్లు రోజూ అభ్యసనా తరగతులు నిర్వహించారు. తాను, మా సిబ్బంది పర్యవేక్షించాం. ఫొటోలు కూడా మా ఉన్నతాధికారులకు అప్లోడ్ చేశాం. పరీక్షలు రాసే విధంగా అభ్యాసకులను ఇప్పటికే సిద్ధం చేశాం.
–భాస్కరరెడ్డి, నోడల్ ఆఫీసర్, నంద్యాల
ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అంటారు. మహిళ చదువుకుంటే ఆమెలో ఆత్మవిశ్వాసం పెరిగి పిల్లల పెంపకంతో పాటు ఆర్థిక వ్యవహరాల్లో స్వతంత్య్రంగా వ్యవహరించనుంది. కుటుంబానికి సారథిగా ఎదిగి రాణించే అవకాశం కలుగుతుంది. ఈ నేపథ్యంలో మహిళల్లో అక్షరాస్యత శాతం పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అధికారుల నిర్లక్ష్యంతో లక్ష్యం నీరుగారిపోతుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉల్లాస్ కార్యక్రమం అధికారుల పర్యవేక్షణ లేక తుస్స్‌మంది. నేడు పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా ఇప్పటి వరకు పలు చోట్ల అభ్యసన తరగతులు చేపట్టకపోవడం, పుస్తకాలు సైతం పంపిణీ చేయకపోవడం విడ్డూరం.
నంద్యాల(న్యూటౌన్): గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులైన మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉల్లాస్ కార్యక్రమం జిల్లాలో తుస్సుమంది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో ఎక్కడా అభ్యసనా తరగతులు సక్రమంగా నిర్వహించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నేడు ఆదివారం జరగనున్న అర్హత పరీక్ష గురించి వారికి తెలియదంటున్నారంటే అధికారుల తీరు ఎలా ఉందో అర్థమవుతోంది. ప్రస్తుత రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు నిరక్షరాస్యత అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో ఉల్లాస్ పేరుతో చదవడం, రాయడం నేర్పించే ప్రయత్నం చేస్తున్నారు. పొదుపు సంఘాల మహిళలు, పాఠశాలల్లో పని చేస్తున్న వంట ఏజెన్సీ నిర్వాహకులు, ఆయాలు, అంగన్‌వాడీ కేంద్రాల ఆయాలకు రాత్రి పూట రెండు గంటల పాటు అభ్యసనా తరగతులు నిర్వహించాలి. జిల్లాలోని ప్రతి మండలం నుంచి 1000 మంది చొప్పున మొత్తం 26,784 మందిని గుర్తించారు. వీరికి గత ఏడాది డిసెంబర్ 24 నుంచి తొలి విడతగా అభ్యసనా తరగతులు ప్రారంభించారు. వీరిలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఎక్కువ మంది మహిళలు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులే. వీరికి బోధించేందుకు ప్రతి పది మందికి ఒకరు చొప్పున సంఘంలో విద్యావంతులైన ఒక స్వచ్ఛంద శిక్షకురాలిని నియమించారు. రోజుకు రెండు గంటల పాటు ఆయా గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రం, సామాజిక భవనం, ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఎక్కడో ఒక చోట అభ్యసనా తరగతులు నిర్వహించాలి. అభ్యసనా సామగ్రి కూడా ప్రభుత్వం అందజేసింది. అయితే ఉల్లాస్ కార్యక్రమంలో గ్రామాల్లో అభ్యసనా తరగతులు తూతూ మంత్రంగా సాగినట్లు తెలుస్తోంది. నమోదైన మహిళలందరికీ వలంటీర్లు ప్రాథమిక అక్షరాస్యత పరీక్ష ఈ నెల 23వ తేదీన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ ద్వారా నిర్వహించేందుకు సన్నద్ధం చేశారు.
ఎలా రాయాలో? ఏమి రాయాలో!
ఈనెల 23న ఉల్లాస్ పరీక్ష ఉండటంతో అభ్యసకులు ఆందోళన చెందుతున్నారు. గ్రామాల్లో ఎక్కడా సక్రమంగా అభ్యసనా తరగతులు జరగలేదని.. ఎక్కడో జరిగినా అవి తూతూ మంత్రంగా జరిగాయని విమర్శలు వినిపిస్తున్నాయి. సంబంధిత అధికారులు కూడా ఉల్లాస్ శిక్షణ తరగతులు పర్యవేక్షణ చేయలేదని, అక్కడక్కడా ఫొటోలకు ఫోజులిచ్చి వెళ్లిపోయారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. డ్వాక్రా మహిళలు కనీసం ఒక్క రోజూ కూడా అభ్యసన తరగతులు నిర్వహించలేదని, చదువుకునేందుకు ఒక్క పాఠ్యపుస్తకం ఇవ్వలేదు చెబుతున్నారు. ఈ నెల 23వ తేదీన అర్హత పరీక్ష నిర్వహిస్తారని తెలిసిందని, ఆ పరీక్షలో ఏమి రాయాలో, ఎలా రాయా లో తెలియక ఆందోళనగా ఉందని చెబుతున్నారు. ఉల్లాస్ కార్యక్రమంలో అభ్యసనా తరగతుల నిర్వహణకు ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు పెట్టి పాఠ్య పుస్తకాలు, అభ్యాసకుల హాజరు పట్టికలు ముంద్రించింది. వాటిని పూర్తి స్థాయిలో పంపిణీ చేయక పోవడంతో స్థానిక వెలుగు కార్యాలయాల్లో మూల న మగ్గుతున్నాయి. మహిళలందరినీ విద్యావంతు లు చేయాలనే కేంద్ర ప్రభుత్వం లక్ష్యానికి అధికారులుతూట్లు పొడుస్తున్నారని, రూ.కోట్లు ప్రజాధనం వృథా అవుతుందని జిల్లాలో పలువురు విమర్శిస్తున్నారు.
జిల్లాలో ఇలా..
పరీక్ష కేంద్రాలు : 760
పరీక్ష రాయనున్న వారు : 26,784
పరీక్ష తేదీ : 23-03-2025
సమయం : ఉదయం 10 గంటల నుంచి
సాయంత్రం 5 గంటల మధ్య
కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు
గ్రామాల్లో కానరాని
అభ్యసనా తరగతులు
అధికారుల పర్యవేక్షణ కరువు
నేడు పరీక్ష ..అభ్యాసకుల ఆందోళన
జిల్లాలో పరీక్షకు హాజరు కానున్న
26,784 మంది
ఉల్లాస్.. తుస్..!
Comments
Please login to add a commentAdd a comment