నేడు అర్జీల స్వీకరణ
కర్నూలు(సెంట్రల్): కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు అర్జీలను సమర్పించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్‌తోపాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
జాతీయ పోటీల్లో స్వర్ణం
కర్నూలు (టౌన్): అహ్మదాబాదులో ఈనెల 20 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించిన సీనియర్ జాతీయ బధిరుల (డెఫ్) టెన్నిస్ క్రీడలో కర్నూలు క్రీడాకారిణి జాఫ్రీన్ బంగారు పతకం సాధించింది. కర్నూలులో డిప్యూటీ రిజిస్ట్రార్ కో–ఆపరేటివ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఆమె మహిళల సింగిల్స్ విభాగంలో స్వర్ణం, అలాగే నంద్యాల జిల్లాకు చెందిన చందన్‌తో కలిసి మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో బంగారు పతకం సాధించింది. దీంతో ఈ ఏడాది నవంబర్‌లో జపాన్ దేశంలో నిర్వహించనున్న అంతర్జాతీయ బధిరుల ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు అర్హత సాధించింది. ఈ సందర్భంగా క్రీడా సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా
కర్నూలు: జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోటు చేసుకుంటున్న సంఘటనలను దృష్టిలో ఉంచుకొని జిల్లా పోలీస్ శాఖ రౌడీ షీటర్ల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ఆదివారం జిల్లా అంతటా పోలీస్ స్టేషన్ల వారీగా 584 మంది రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. నేర ప్రవృత్తికి స్వస్తి పలికి గౌరవ ప్రదమైన జీవితం కొనసాగించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా రౌడీ షీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులకు కౌన్సెలింగ్ ఇస్త్తూనే, కొత్తగా కేసుల్లో ఇరుక్కున వారి జాబితాను సిద్ధం చేస్తున్నారు. స్టేషన్ల వారీగా రౌడీ షీటర్లు జీవనోపాధికి చేస్తున్న వృత్తులపై కూడా ఆరా తీస్తున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటే, పోలీస్ శాఖ పరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
సబ్ డివిజన్ల వారీగా రౌడీ షీటర్లు ఇలా ...
జిల్లాలోని వివిధ సబ్ డివిజన్ల వారీగా 584 మంది రౌడీ షీటర్లు ఉన్నారు. అందులో కర్నూలు సబ్ డివిజన్ పరిధిలో 199 మంది, ఆదోని 87, పత్తికొండ 112, ఎమ్మిగనూరులో 186 మంది ఉన్నారు.
నేడు అర్జీల స్వీకరణ
Comments
Please login to add a commentAdd a comment