కొలిమిగుండ్ల: ఆరుగాలం కష్టపడి పసుపు సాగు చేసిన రైతులు ఈ ఏడాది నష్టాలు మూటగట్టుకుంటున్నారు. ఎన్నో ఆశలతో పండించిన పంటకు రోజురోజుకు మార్కెట్‌లో ధర పడిపోతుండటంతో ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి అన్నదాతకు ఏమాత్రం సహాయ సహకారాలు అందడం లేదు. జిల్లాలో కొలిమిగుండ్ల మండలంలోని తిమ్మనాయినపేట, ఆళ్లగడ్డ, చాగలమర్రి, శిరివెళ్ల, రుద్రవరం, ఆళ్లగడ్డ, పాములపాడు తదితర మండలాల్లో 590 హెక్టార్లలో పసుపు సాగు చేశారు. నామమాత్రంగా వర్షాలు కురిసినప్పటికీ బోర్ల కింద రైతులు పంట వేసేందుకు ముందుకొచ్చారు. పంట వేసిన కొద్ది రోజులకే దుంప తెగులు ఆశించి పంట బాగా దెబ్బతిని దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. పసుపు సాగుకు కనీసం తొమ్మిది నెలల సమయం పడుతుంది. పైగా పెట్టుబడి సైతం ఎక్కువగా ఉంటుంది. ఎకరా సాగుకు విత్తనం, కలుపుతీత, కూలీలు, రసాయన ఎరువులు, పసుపు కొమ్ముల తవ్వకానికి, ఉడకబెట్టేందుకు దాదాపు రూ.1.50 లక్షలకు పైగానే ఖర్చు వస్తోంది. సాధారణంగా ఎకరాకు 30 నుంచి 30 క్వింటాళ్లు రావాల్సి ఉండగా దుంప తెగులు ఆశించడంతో దిగుబడి 25 క్వింటాళ్లలోపే వచ్చింది.
నిరాశపర్చుతున్న ధరలు
ఏడాదిలో తొమ్మిది నెలలు రేయింబవళ్లు కష్టపడి పంట పండించిన పంట దిగుబడి చేతికొచ్చే సరికి ధరలు పూర్తిగా తక్కువగా ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం పసుసు మార్కెట్‌లో క్వింటా ధర రూ.9 నుంచి 10 వేల మాత్రమే ధర పలుకుతుంది. ఈ పరిస్థితుల్లో కష్టానికి నష్టాలే మిగులుతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గరిష్టంగా 10 వేలు ఉండటంతో మార్కెట్‌లో గ్రేడింగ్ పేరుతో క్వింటాకు రూ. 8 వేలు దక్కడం కష్టమంటున్నారు. ఈపరిస్థితిల్లో పెట్టుబడి అయినా చేతికందుతుందా లేదోనని ఆందోళన చెందుతున్నారు. క్వింటాకు కనీసం రూ.15వేలు ధర ఉంటే కష్టానికి తగ్గఫలితం లభిస్తుందన్నారు.
జిల్లాలో 590 హెక్టార్లలో పసుపు సాగు
దుంప తెగులుతో తగ్గిన దిగుబడులు
మార్కెట్‌లో ధర పతనంతో
రైతుల ఆందోళన