
అక్షరాలతో రామాయణ చరిత్ర
నంద్యాల(అర్బన్): శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణానికి చెందిన చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ రామచరిత్రను తెలుగు అక్షరాలతో శ్రీరాముని ఊహా చిత్రాన్ని గీచారు. ఏ3 డ్రాయింగ్ షీట్‌పై మైక్రో పెన్నుతో 3 గంటలు శ్రమించి గీచిన చిత్రం పలువురి మన్ననలు అందుకుంది. ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ శ్రీరాముని జననం నుంచి పట్టాభిషేకం వరకు అక్షరాలతో ఊహా చిత్రాన్ని గీచానన్నారు. మహావిష్ణువు ప్రేతాయుగంలో శ్రీరాముడిగా లోక కల్యాణం కోసం అవతరించాడని, శ్రీరామచంద్రుడు సద్గుణవంతుడు, ఆదర్శప్రాయుడు, తండ్రి మాట జవదాటని తనయుడిగా ఒకే మాట, ఒకే బాణం, ఒకే సతీతో ఆదర్శంగా నిలిచారన్నా రు. ధర్మం తప్ప కుండా మనిషి ఎలా జీవించాలో లోకానికి చాటి చెప్పిన కారణజమ్ముడు శ్రీరాముడన్నారు.
కుక్క దాడిలో ఐదుగురికి గాయాలు
కొలిమిగుండ్ల: బెలుం శింగవరంలో వీధి కుక్క దాడి చేయడంతో శనివారం ఐదుగురికి గాయాలయ్యాయి. ఉదయం ఎవరి పని మీద వాళ్లు వీధుల్లో వెళుతుండగా దాడి చేసి గాయపర్చింది. నారాయణరెడ్డి, భూపాల్‌రెడ్డి, రంగేశ్వరరెడ్డితో ఇద్దరు పిల్లలు గాయపడ్డారు. చికిత్స కోసం కుటుంబ సభ్యులు వారిని కొలిమిగుండ్ల పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. గ్రామంలో వీధుల్లో కుక్కల బెడద కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు పేర్కొన్నారు. ఎప్పుడు జనాల మీద దాడి చేస్తాయో తెలియని పరిస్థితి ఏర్పడిందని వాపోయారు.