
ఆర్టీసీ డిపో మేనేజర్ ఇంట్లో భారీ చోరీ
కర్నూలు: కర్నూలు ఆర్టీసీ 2వ డిపో మేనేజర్‌గా పనిచేస్తున్న జమృద్ సర్దార్ హుసేన్ ఇంట్లో దొంగలు పడి అందినకాడికి మూటగట్టుకొని ఉడాయించారు. ఆయన నగరంలోని గణేష్‌నగర్ పక్కన ఉన్న సాయి వైభవ నగర్‌లో నివాసం ఉంటున్నారు. మనువరాలికి ఆరోగ్యం సరిగా లేదని తెలియనడంతో కుటుంబ సభ్యులతో కలిసి సర్దార్ హుసేన్ శనివారం హైదరాబాద్‌కు వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన దొంగలు ఇంటి గ్రిల్ తాళాలతో పాటు ప్రధాన తలుపులకు ఉన్న తాళాలను పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. పడకగదిలో ఉన్న బీరువాను బద్దలు కొట్టి అలమారాలో ఉన్న 42 తులాల బంగారు నగలు, రూ.50 వేల నగదును మూటగట్టుకొని ఉడాయించారు. ఆదివారం ఉదయం పనిమనిషి ఇళ్లు శుభ్రం చేసేందుకు వచ్చే సరికి తలుపులు తెరచి ఉండడంతో ఫోన్ చేసి ఇంటి యజమానికి సమాచారం ఇచ్చింది. హుటాహుటిన ఆయన హైదరాబాద్ నుంచి కర్నూలుకు చేరుకొని చోరీ జరిగిందని నిర్ధారించుకొని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్, 3వ పట్టణ సీఐ శేషయ్య, ఎస్‌ఐ రహమాన్, సీసీఎస్ సీఐ శ్రీనివాసనాయక్ తదితరులు అక్కడికి చేరుకొని నేరం జరిగిన తీరును పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్స్ సిబ్బందిని రప్పించి ఆధారాలు సేకరించారు. డాగ్ చోరీ జరిగిన ఇంటి వద్ద నుంచి కాలనీ చివరి వరకు వెళ్లి ఆగిపోయింది. చోరి జరిగిన విషయాన్ని తెలుసుకున్న కాలనీ ప్రజలు ఇంటి వద్దకు వచ్చి చూడడంతో పాదాల అచ్చులు పడి సరైన ఆధారాలు క్లూస్ టీంకు లభించలేదు. కాలనీలోని సమీపంలోని సీసీ పుటేజ్‌లను క్రైం పార్టీ సిబ్బంది సేకరించి పాత నేరస్తుల ఫొటోలతో జతపరిచి దొంగలను గుర్తించే పనిలో ఉన్నారు. బాధితుడు సర్దార్ హుసేన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మాజీ సైనికుడి ఇంట్లో దొంగతనం
డోన్ టౌన్: పట్టణంలోని శ్రీరామ్‌నగర్‌లో నివసిస్తున్న మాజీ సైనికుడు ధర్మారెడ్డి ఇంట్లో పట్ట పగలు చోరీ జరిగింది. ఈయన భార్యతో కలిసి శనివారం ఇంటికి తాళం వేసి బంధువుల ఊరు పత్తికొండకు వెళ్లాడు. గమనించిన గుర్తు తెలియని దుండగులు ఇంటి వెనుక భాగం నుంచి గోడ దూకి తాళం పగుల గొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. బీరువాలో ఉన్న 10 తులాల బంగారు నగలు, రూ.30 వేల నగదు అపహరించకుపోయారు. బాధితుడు శనివారం రాత్రి 9 గంటలకు ఇంటికి చేరుకొని చూడగా తాళం తెరిచి ఉండటంతో చోరీ జరిగిందని నిర్ధారించుకుని పోలీసులకు సమాచారమిచ్చాడు. దీనిపై వారు ఆదివారం విచారణ చేపట్టారు.
42 తులాల బంగారు,
రూ.50 వేల నగదు అపహరణ