టీడీపీ సానుభూతిపరులకే ఉపాధి పనులు | - | Sakshi
Sakshi News home page

టీడీపీ సానుభూతిపరులకే ఉపాధి పనులు

Published Wed, Apr 16 2025 12:39 AM | Last Updated on Wed, Apr 16 2025 12:39 AM

టీడీపీ సానుభూతిపరులకే ఉపాధి పనులు

టీడీపీ సానుభూతిపరులకే ఉపాధి పనులు

● రాజకీయాలకు అతీతంగా అడిగిన వారందరికీ ఉపాధి పనులు కల్పించాల్సి ఉంది.

● అయితే ఉపాధిలో నేడు రాజకీయాలదే పైచేయి. పలు మండలాల్లో టీడీపీ మద్దతుదారులకు మాత్రమే పనులు కల్పిస్తున్నారు.

● పశ్చిమ ప్రాంతం నుంచి ఈ సారి వలసలు అధికంగా ఉన్నాయి.

● ఆయా గ్రామాల్లో పనులు పెట్టి ఇబ్బడిముబ్బడిగా బోగస్‌ హాజరుతో మస్టర్లను నింపేశారు.

● కూలీలు, చిన్న రైతులను టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీలుగా విభిజించి పనులు కల్పిస్తున్నారు.

● టీడీపీ అనుకూలం అయితే గరిష్ట వేతనం రూ.300, వైఎస్‌ఆర్‌సీపీ అనుకూలమైతే అతి తక్కువ వేతనం ఇస్తున్నటున్ల చర్చ ఉంది.

తుగ్గలి మండలం ఎద్దులదొడ్డి గ్రామ పంచాయతీలో పాత పనులకే మెరుగులు దిద్దుతున్న దృశ్యం

తుగ్గలి మండలం ఎద్దులదొడ్డి పంచాయతీ నుంచి ఈ సారి వందలాది మంది కూలీలు, చిన్న, సన్నకారు రైతులు వలస వెళ్లారు. ఆ సమయంలో ఉపాధి పనులు పెట్టి పెద్ద ఎత్తున బోగస్‌ మస్టర్లు వేసుకున్నారు. 20 మంది వస్తే 200 మంది హాజరైనట్లు మస్టర్లు వేసి ఒకటి, రెండు ఫొటోలనే అటు, ఇటు చేసి అన్ని మస్టర్లకు అప్‌లోడ్‌ చేసినట్లు సమాచారం. ఇటీవల వలస వెళ్లిన వాళ్లు తిరిగొచ్చినా ఉపాధి కల్పించడంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. 2022లో చేపట్టిన పనులకే మెరుగులు

దిద్ది ఉపాధి నిధులు స్వాహా చేస్తున్నారనే ఫిర్యాదు ఉన్నాయి.

కర్నూలు(అగ్రికల్చర్‌): ఫీల్డ్‌ అసిస్టెంట్లు.. మేట్‌లు.. సీనియర్‌ మేట్లు టీడీపీ కార్యకర్తలే. సాంకేతిక సహాయకులు, ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్లు, ఏపీఓలు టీడీపీ అనుకూలురే. ఈ నేపథ్యంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. కూటమి పార్టీల నాయకులు, ఉపాధి సిబ్బంది ఏకమై నిధులను కొల్లగొడుతున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతోనే టీడీపీ నేతల దృష్టి ఎన్‌ఆర్‌ఈజీఎస్‌పై పడింది. కొన్నేళ్లుగా ఎలాంటి ఫిర్యాదులు లేకుండా ఫీల్డ్‌ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న వారిని తప్పించి తమ వారిని నియమించుకున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 859 ఫీల్డ్‌ అసిస్టెంటు పోస్టులు ఉండగా.. 10 నెలల్లోనే 85 శాతం మందిని తప్పించారు. మాట వినని వారిపై దాడులకు తెగబడుతున్నారు. ఆలూరు నియోజక వర్గంలో ఫీల్డ్‌ అసిస్టెంటు రాజీనామా చేయడం లేదనే కారణంగా కత్తులు, కొడవళ్లతో నరికి చంపారు. కొందరు టీడీపీ నేతలు ఈ పోస్టులను అమ్ముకున్నట్లు తెలుస్తోంది. ఆలూరు, పత్తికొండ, మంత్రాలయం, ఆదోని, డోన్‌, నందికొట్కూరు నియోజక వర్గాల్లో రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు అమ్ముకున్నట్లు సమాచారం.

పాత పనులకే మెరుగులు

జేబులు నింపుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లు, టీఏలు ఇతర ఉపాధి సిబ్బంది టీడీపీ నేతల అక్రమాలకు ఇతోధికంగా సహకరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. పత్తికొండ, తుగ్గలి, కౌతాళం, దేవనకొండ, మంత్రాలయం, హాలహర్వి, పెద్దకడుబూరు, కర్నూలు, కల్లూరు, క్రిష్ణగిరి, కోసిగి, ఆదోని, నందవరం, డోన్‌, ప్యాపిలి, బేతంచెర్ల, కొలిమిగుండ్ల, నందికొట్కూరు, మిడుతూరు తదితర మండలాల్లో పాత పనులకే మెరుగులు దిద్ది నిధులను కొల్లగొడుతుండటం గమానార్హం. 2022, 2023 సంవత్సరాల్లో చేసిన పనులనే ఇప్పుడు చేసినట్లు మస్టర్లు వేసుకొని నిధుల స్వాహాకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 75 శాతం పాత పనులతోనే మమ అనిపిస్తున్నా చర్యలు శూన్యం.

ముడుపులు ఇస్తేనే జాబ్‌ కార్డులు

అడిగిన వారందరికీ జాబ్‌కార్డులు ఇచ్చి పనులు కల్పించాలి. ఎలాంటి రుసుం లేకుండా జాబ్‌ కార్డు జారీ చేయాలి. జాబ్‌కార్డు జారీలో ఫీల్డ్‌ అసిస్టెంటు, కంప్యూటర్‌ ఆపరేటర్‌ ముఖ్యం. జాబ్‌ కార్డుకు రెకమెండ్‌ చేయడానికి రూ.1,500 నుంచి రూ.2వేల వరకు ముడుపులు వసూలు చేస్తున్నారు. ఈ పరిస్థితికి తుగ్గలి, పత్తికొండ, కౌతాళం, ప్యాపిలి, కోసిగి తదితర మండలాల్లో అధికంగా ఉన్నట్లు సమాచారం.

ఒక్క ఫొటొతో లెక్కలేనన్ని మస్టర్లు

తమ్ముళ్ల జేబు నింపుతున్న ఉపాధి పనులు

ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు, మేట్లు టీడీపీ కార్యకర్తలే..

దొంగ హాజరుతో నిధుల స్వాహా

పాత పనులకే మెరుగులు దిద్దుతున్న వైనం

ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు 15వేల ఫాంపాండ్స్‌ నిర్మించాలనేది లక్ష్యం. ఇప్పటికే వీటికి సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. పనులను లేబర్‌తోనే చేయించాల్సి ఉన్నా పలు మండలాల్లో యంత్రాలతో కానిచ్చేస్తున్నారు. జేసీబీతో పనులు చేయించిన తర్వాత ఒకటి, రెండు రోజులు లేబర్‌తో పనులు చేయించి బిల్లులు కొల్లగొడుతున్నారు. ఒక్కో ఫాంపాండ్‌ సైజును బట్టి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు స్వాహా చేస్తున్నట్లు తెలుస్తోంది. రాత్రికి రాత్రే యంత్రాలతో ఈ తతంగం నడుస్తోంది. ఎవరైనా ఫిర్యాదు చేస్తే వైఎస్‌ఆర్‌సీపీ వర్గీయులుగా ముద్ర వేసి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement